మొలకెత్తే మాస్క్‌పై అమెరికా మీడియా ఆసక్తి..

8 Jun, 2021 17:57 IST|Sakshi
మొలకెత్తే పేపర్‌ సీడ్‌ మాస్క్‌

బెంగళూరు వాసి వినూత్న యత్నం

ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న మొలకెత్తే మాస్క్‌

న్యూఢిల్లీ: కరోనా కాలంలో మాస్క్‌ మానవుడి చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. కోవిడ్‌ బారిన పడకుండా ఉండాలంటే మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలి. అయితే మనం వాడుతున్న మాస్క్‌లను ఎప్పుడో ఒకసారి పడేయాలి. దాని వల్ల భారీగా చెత్త పేరుకుపోతుంది. ఫలితంగా మరో కొత్త సమస్య. దీనికి చెక్‌ పెట్టే క్రమంలో రూపొందించిందే మొలకెత్తే మాస్క్‌. వాడిన తర్వాత పడేస్తే.. ఈ మాస్క్‌లు మొలకెత్తుతాయి. ఫలితంగా ఇవి మనుషులను కాపాడటమే కాక.. పర్యావరణాన్ని కూడా పరిరక్షిస్తాయి. ఇక ఈ మొలకెత్తే మాస్క్‌ల సృష్టికర్త భారతీయుడే కావడం గర్వకారణం. ప్రస్తుతం ఈ మొలకెత్తే మాస్క్‌లు అంతర్జాతీయ సమాజంలో హాట్‌టాపిక్‌గా మారాయి. వీటిపై అమెరికా మీడియా ఆసక్తి కనబరుస్తోంది. ఆ వివరాలు.. 

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన నితిన్‌ వాస్‌ పర్యావరణానికి మేలు చేసే ‘పేపర్‌ సీడ్‌ మాస్క్‌’ తయారు చేశారు. మంగళూరు నగర శివారులోని కిన్నిగోళికి అనుబంధమైన పక్షితీర్థం ఆయన స్వగ్రామం. మాస్క్‌ తయారాలో కాటన్‌ గుడ్డను పల్ప్‌గా మార్చి షీట్‌లుగా మారుస్తారు. సుమారు 12 గంటల పాటు ఆరబెట్టి  మాస్క్‌ తయారు చేస్తారు. మాస్క్‌ వెనుక భాగాన పలచటి కాటన్‌ గుడ్డ వేశారు. మాస్క్‌ దారాలను సైతం పత్తితోనే రూపొందించారు. కాటన్‌ షీట్‌లో తులసితో పాటు పదికిపైగా ఔషధ, కూరగాయల విత్తనాలను ఉంచారు. ఉపయోగించిన తర్వాత ఈ మాస్క్‌ను పడేసిన ప్రాంతంలో మొక్కలు మొలకెత్తుతాయి. 

ఇప్పటికే మార్కెట్‌లోకి విడుదల చేసిన ఈ మాస్క్‌పై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పూర్తిగా చేతితో రూపొందించిన ఈ మాస్క్‌ ధర కేవలం 25 రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ ధరలో ఎకో ఫ్రెండ్లి మాస్క్‌లు అభివృద్ధి చేసిన నితిన్‌ వాస్‌ గురించి తెలుసుకునేందుకు అమెరికన్‌ మీడియా ఆసక్తి చూపుతోంది. అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ(ఏబీసీ) వర్చువల్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. దక్షిణాఫ్రికాలోని అవర్‌మనీలో రెండు రోజుల్లో ఇంటర్వ్యూ ప్రసారం చేయనున్నట్టు ఏబీసీ పేర్కొంది. నితిన్‌  వాస్‌ను అభినందిస్తూ ఉపముఖ్యమంత్రి అశ్వత్థనారాయణ పోస్టు చేశారు.

చదవండి: షాకింగ్‌: మాస్క్‌ అడగడంతో ఉమ్మేసి మహిళ పరుగు

మరిన్ని వార్తలు