-

యుద్ధం ఆపుతామని మాటిచ్చిన పుతిన్‌! మోదీపై అమెరికా మీడియా ప్రశంసల వెల్లువ

17 Sep, 2022 15:49 IST|Sakshi

భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా మీడియా ఆకాశానికెత్తింది. ఉజ్బెకిస్థాన్‌లో నిర్వహించిన ఎస్‌సీఓ సమావేశంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన ఆయన ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపాలని సూచించడంపై ప్రశంసలతో ముంచెత్తింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను హైలైట్ చేస్తూ అమెరికా ప్రముఖ వార్తా సంస్థలు, వాషింగ్టన్ పోస్టు, న్యూయార్క్ టైమ్స్‌ తమ పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించాయి. 

'సమకాలీన ప్రపంచంలో యుద్ధానికి తావులేదు.. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించండి' అని మోదీ పుతిన్‌తో అన్నారు అంటూ వాషింగ్టన్ పోస్టు హెడ్‌లైన్‌లో చెప్పింది. దీంతో రష్యా అధ్యక్షుడు ప్రపంచ నలుమూలల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్నట్లు అయిందని పేర్కొంది.

మోదీకి బదులిస్తూ.. యుద్ధాన్ని సాధ్యమైనంత త్వరగా ముగిస్తామని పుతిన్ మాటిచ్చారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. భారత్‌ ఆందోళనను తాము అర్థం చేసుకోగలమని, చర్చల ప్రక్రియను ఉక్రెయిన్ బహిష్కరించడం వల్లే సైన్యం ఇంకా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని పుతిన్ చెప్పినట్లు వెల్లడించింది. 

ఎస్‌సీఓ సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‍పింగ్ కూడా పుతిన్‌లో మాట్లాడారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం గరించి ఒక్క మాట కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలుస్తోంది. మోదీ మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తి యుద్ధాన్ని ఆపాలని కోరడాన్ని అమెరికా మీడియా కొనియాడింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత పుతిన్‌తో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే పలుమార్లు ఫోన్లో ఈ విషయంపై మాట్లాడారు.
చదవండి: బీజేపీ హర్ట్ అయ్యింది.. కారణం ఇదే: కేజ్రీవాల్

మరిన్ని వార్తలు