ముంబై పవర్‌కట్‌: డ్రాగన్‌ పనే!

1 Mar, 2021 17:34 IST|Sakshi

సంచలన విషయాలు వెల్లడించిన అమెరికా సంస్థ నివేదిక

ముంబై పవర్‌ కట్‌తో భారత్‌ను హెచ్చరించిన డ్రాగన్‌

న్యూఢిల్లీ: గతేడాది దేశ ఆర్థిక రాజధాని ముంబై వ్యాప్తంగా భారీ పవర్ ‌కట్‌ సంభవించిన సంగతి తెలిసిందే. ఎలక్ట్రిక్‌ డిపార్ట్‌మెంట్‌ వారి అజాగ్రత్త వల్లనో.. లేక మరే ఇతర కారణాల వల్లనో ఈ పవర్‌ కట్‌ సంభవించి ఉంటుందని భావించారు జనాలు. కానీ వాస్తవం ఇది కాదట. నాటి ముంబై పవర్‌ కట్‌ వెనక చైనా హ్యాకర్లు ఉన్నారట. ఈ విషయాన్ని ఓ అమెరికన్‌ సంస్థ వెల్లడించింది. డ్రాగన్‌ దేశం సరిహద్దుల్లోనే కాక మన దేశంలోకి కూడా తొంగి చూస్తోందనే వార్త ప్రస్తుతం ఆందోళనలు రేకెత్తిస్తోంది. 

కాగా గతేడాది సరిహద్దు ఉద్రిక్తత సమయంలోనే చైనా ఈ కుతంత్రానికి పాల్పడినట్లు తెలుస్తోంది.. ఆ సమయంలో డ్రాగన్‌.. మన దేశ విద్యుత్తు‌ రంగంపై గురిపెట్టిందని.. మన ప్రభుత్వానికి చెందిన విద్యుత్తు సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లు, లోడ్‌ డిస్పాచ్‌‌ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్‌ గ్రూప్‌లు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన సదరు సంస్థ వెల్లడించింది. 

గతేడాది అక్టోబరు 12న  ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా స్తంభించి అనేక రైళ్లు, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు, స్టాక్‌ మార్కెట్‌ లావాదేవీలు వంటి తదితర కార్యక్రమాలు నిలిచిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్‌ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ కరెంట్‌ కట్‌కు.. సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్‌ ఫ్యూచర్‌ అనే సంస్థ ఓ అధ్యయనం ద్వారా వెల్లడించింది. ఉద్రిక్తతల సమయంలో భారత పవర్‌గ్రిడ్‌పై చైనా సైబర్‌ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్‌ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా ‘ముంబయి పవర్‌కట్‌’తో హెచ్చరించిందని సదరు సంస్థ తెలిపింది. 

చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్‌ఎకో గ్రూప్‌ అనే సంస్థ భారత్‌లోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్‌ డిస్‌ప్యాచ్‌ సెంటర్లు, విద్యుత్‌ సంస్థల కంప్యూటర్‌ నెట్‌వర్క్‌లను లక్ష్యంగా చేసుకున్నాయని ఈ అధ్యయనం వెల్లడించింది. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడి చేసినట్లు తెలిపింది. ఈ ఐపీ అడ్రస్‌ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్‌ సిస్టమ్స్‌లోకి సైబర్‌ నేరగాళ్లు మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టినట్లు రికార్డెడ్‌ ఫ్యూచర్ నివేదిక పేర్కొంది. 

మహారాష్ట్రలోని పద్గాలో గల లోడ్‌ డిస్పాచ్‌‌‌ సెంటర్‌లో ఈ మాల్‌వేర్‌ కారణంగానే సాంకేతిక లోపం తలెత్తిందని, ఇది ముంబయిలో భారీ పవర్‌కట్‌కు దారితీసిందని అధ్యయనం పేర్కొంది. వాస్తవానికి గల్వాన్‌ ఘర్షణ జరిగిన తర్వాత కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్‌ మాట్లాడుతూ.. చైనాలో తయారయ్యే విద్యుత్‌ పరికరాల్లో మాల్‌వేర్‌ ఉందేమో అన్న అంశంపై తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఆయన ఈ విషయం చెప్పిన కొన్ని నెలలకే ముంబయిలో గ్రిడ్‌ విఫలం కావడం గమనార్హం.  

కాగా.. సరిహద్దు వివాదానికి తెరదించేలా ఇటీవల భారత్‌, చైనా కీలక ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాలు బలగాలను ఉపసంహరించాయి. ఇలాంటి సమయంలో ఈ అధ్యయనం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

చదవండి: 
ఢిల్లీ ఓటమి.. అందుకే ముంబైలో పవర్‌ కట్‌!
ఆ వ్యూహం మా‌ దగ్గర పని చేయదు: నరవాణే

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు