బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌, అమిత్‌ షా ఇంటిని కూల్చేయండి

20 Apr, 2022 17:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు కూల్చివేతల పనులను కొనసాగించారు. ఆ స‌మ‌యంలో జ‌హంగీర్‌పురిలో ఉద్రిక్త‌త‌లు ఏర్ప‌డ్డాయి. దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, ఇటీవ‌ల హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌ల స‌మ‌యంలో జ‌హంగీర్‌పురిలో గొడ‌వ‌లు జ‌రిగిన విష‌యం విధితమే.

ఈ సందర్బంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ఎంపీ రాఘవ్‌ చద్దా సంచలన కామెంట్స్‌ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్వ‌యంగా ఈ అల్ల‌ర్ల‌ను ప్రోత్స‌హిస్తున్నారని ఆరోపించారు. మీరు బుల్డోజ‌ర్ల‌ను ఉప‌యోగించాల‌నుకుంటే.. బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌, అమిత్‌ షా ఇంటిని కూల్చేయండి అంటూ మండిపడ్డారు. అప్పుడు అల్ల‌ర్లు ఆగిపోతాయి అంటూ రాఘ‌వ్ చ‌ద్దా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ‌త 15 ఏళ్లుగా బీజేపీ పార్టీనే మున్సిప‌ల్ అధికారాన్ని అనుభ‌వించిందని, ఆ స‌మ‌యంలో అనేక ముడుపులు తీసుకొని, అక్ర‌మ నిర్మాణాల‌కు అనుమ‌తినిచ్చింద‌ని తెలిపారు. ముడుపులు తీసుకున్న బీజేపీ నేత‌ల ఇళ్ల‌ను కూడా ఇలాగే కూల్చేయాల‌ని చద్దా డిమాండ్ చేశారు.

ఇళ్ల కూల్చివేతపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ స్పందించారు. రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా..‘‘భార‌త రాజ్యాంగ విలువ‌ల‌ను కూల్చేస్తున్నారంటూ ఘాటు వ్యాఖ‍్యలు చేశారు. పేద‌లు, మైనారిటీలే ల‌క్ష్యంగా ఇలా చేస్తున్నార‌ని రాహుల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది చదవండి: ప్రశాంత్‌ కిషోర్‌పై సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు.. ఆయన అంటేనే ఓ బ్రాండ్‌..

మరిన్ని వార్తలు