మీసం మెలేసేది రైతన్నే!

6 Feb, 2022 04:28 IST|Sakshi

దుక్కి దున్ని.. నారు పెట్టి.. నాగలి పట్టిన రైతన్నే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల రణక్షేత్రంలోకి దిగి మీసం మెలేస్తున్నాడు. పోటీకి సై అంటున్నాడు. చట్టాల రూపకల్పనలో తనకూ భాగస్వామ్యం కావాలని గొంతెత్తున్నాడు. తనను పక్కనపెట్టినా, తక్కువ చేసినా తగ్గేదేలే అని హెచ్చరిస్తున్నాడు.

సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమం తర్వాత యూపీ రాజకీయాల్లో పెరిగిన రైతుల పాత్ర ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశాలున్నాయి. అక్కడంతా రైతు ఎజెండా, రైతు నేతల మద్దతు చుట్టూతే రాజకీయం గిర్రున తిరుగుతోంది. యూపీ జనాభాలో 60 శాతానికి పైగా వ్యవసాయంపై ఆధారపడి ఉండగా, ప్రతి సీటు గెలుపులోనూ వీరిపాత్రే కీలకంగా ఉండనుంది. ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్న రైతులను చట్టసభలకు పంపేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. గ్రామీణ జనాభా ఉన్న ప్రాంతాల్లో సుమారు 250కి పైగా అసెంబ్లీ స్థానాలు ఉండటంతో రైతు నేపథ్యం గల రాజకీయ నేతలను పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి.

గడిచిన నాలుగు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే వివిధ రంగాలకు చెందిన వారిలో రైతులే ఎక్కువ సంఖ్యలో అసెంబ్లీకి వెళ్తున్నారు. గత 2017 ఎన్నికల్లో చట్టసభలో ఏకంగా 161 మంది రైతులు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. ఇందులో వ్యవసాయంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తున్న ఎమ్మెల్యేలు 90 మందికి పైగా ఉండడం విశేషం. రైతుల తర్వాత అధిక సంఖ్యలో వ్యాపారులు, ఆ తర్వాత ఉపాధ్యాయులు చట్టసభల్లో ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రధాన పార్టీలు ప్రకటించిన జాబితాల్లో 45శాతం మంది రైతులు ఉన్నారని ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి.

రైతు ఎజెండాతోనే రాజకీయం
మరోవైపు యూపీ ఎన్నికల్లో రైతు అజెండాతోనే రాజకీయ పార్టీలు బాహాబాహీకి దిగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు చట్టాలు, వాటిపై యూపీ రైతుల నుంచే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం కావడం, పుండుపై కారం చల్లినట్లుగా లఖీమ్‌పూర్‌ ఖేరీ ఘటన చోటుచేసుకోవడం, ఈ ఘటనకు బాధ్యుడైన కేంద్ర సహాయ మంత్రి అజయ్‌మిశ్రా తేనిపై ఇంతవరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించకపోవడం వంటి అంశాలు బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచాయి. ఈ వ్యతిరేకతను తప్పించుకునేందుకు బీజేపీ తమ ప్రభుత్వం చేసిన రైతు అనుకూల చర్యలను పదేపదే వల్లెవేస్తోంది.

చిన్న, సన్నకారు రైతుల కోసం రూ.36 వేల కోట్ల రుణాలు అందించామని, పీఎం ఫసల్‌ బీమా యోజన కింద రూ.2.21 కోట్ల మంది రైతులను చేర్చి ఇప్పటికే 28 లక్షల మందికి రూ.2,400 కోట్లు పరిహారం అందించామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇక పీఎం కిసాన్‌ కింద యూపీ రైతులకు రూ.41 వేల కోట్లు జమ అయ్యాయని, ఎరువుల బస్తాల ధరలను రూ.2,400 నుంచి రూ.1200కి తగ్గించిందని తమ ప్రచారాల్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదేపదే ప్రస్తావిస్తున్నారు.

మరోపక్క ఇటీవల జాట్‌ నేతలతో సమావేశం అయిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రైతులకు రూ.36 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని, చెరకు రైతులకు రూ.1.40 లక్షల కోట్ల చెల్లింపులు చేశామని చెబుతూ వారిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారు. ఇక వెనుకబడ్డ బుందేల్‌ఖండ్‌ ప్రాంతానికి తాగు, సాగునీటి వసతిని పెంచేలా కెన్‌–బెత్వా నదుల అనుసంధానానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని బీజేపీ ప్రచారం చేసుకుంటోంది. మరోపక్క రైతుల్లో బీజేపీపై ఉన్న ఆగ్రహాన్ని సమాజ్‌వాదీ పార్టీ–ఆర్‌ఎల్డీ కూటమి తన అస్త్రంగా మలుచుకుంటోంది.

రైతులపై నమోదు చేసిన కేసులు, చనిపోయిన వారికి పరిహారం ఇవ్వకపోవడంపై ప్రశ్నలు సంధిస్తోంది. తాము అధికారంలోకి వస్తే 15 రోజుల్లో కేసులను మాఫీ చేయడంతోపాటు చనిపోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటించింది. దీనికితోడు చెరకు రైతులకు బకాయిల మాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వడ్డీలేని రుణాలు, బీమా సౌకర్యం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. ఇందులో ఎవరి హామీలు, ఎవరి మాటలను రైతులు నమ్ముతారన్నది బ్యాలెట్‌ తేల్చనుంది.

బీజేపీకి కంట్లో నలుసుగా..
అధికార బీజేపీకి రైతు సంఘాల ప్రతినిధులు కంట్లో నలుసులా తయారయ్యారు. పంటలకు కనీస మద్దతు ధరపై తాజా కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటన చేయకపోవడం, రైతు నేతలపై కేసుల ఉపసంహరణకు సంబంధించి నాన్చుడు ధోరణితో విసుగు చెందిన రైతు సంఘాల నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటెయ్యాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కుల, మత రాజకీయాలను రెచ్చగొట్టి ఎన్నికల్లో పబ్బం గడుపుకోవాలనే ధోరణి ఇక చెల్లదని, హిందువులు, ముస్లింల పేరుతో సమాజాన్ని విభజించి ఓట్లు కొల్లగొట్టే రాజకీయాలు పనిచేయవని రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌ ఇటీవల ఘాటు వ్యాఖ్యలు చేశారు. అన్నదాతల సంక్షేమం పట్ల శ్రద్ధ వహించే వారికే ప్రజలు పట్టం కడతారని తేల్చిచెప్పారు. ’మిషన్‌ యూపీ’ ద్వారా రైతు వ్యతిరేక పాలనకు గుణపాఠం చెబుతామని సంయుక్త కిసాన్‌ మోర్చా నేతలు ఇటీవల వెల్లడించారు. ఈ ప్రకటనలు ఎంతమేర ప్రభావం చూపుతాయన్న దానిపై రాజకీయ పార్టీల భవితవ్యం ఆధారపడి ఉంది.  

 – సాక్షి, న్యూఢిల్లీ

>
మరిన్ని వార్తలు