మహిళను కొట్టిన బీజేపీ కార్యకర్తకు షాక్‌.. బుల్‌డోజర్‍తో ఇల్లు కూల్చివేత..

8 Aug, 2022 11:39 IST|Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కార్యకర్త శ్రీకాంత్‌ త్యాగి ఇంటి వద్ద అక్రమ నిర్మాణాని బుల్‌డోజర్లతో కూల్చివేశారు అధికారులు. నోయిడా సెక్టార్ 93లోని గ్రాండ్‌ ఒమాక్సీ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న ఈ ఇంటికి సోమవారం ఉదయం పోలీసు బృందాలతో వెళ్లారు. అనంతరం త్యాగి ఇంటి ముందు భాగాన్ని కూలగొట్టారు.


శ్రీకాంత్ త్యాగి ఇదే హౌసింగ్ సొసైటిలోని ఓ మహిళపై దాడి చేసిన  కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో పొరుగింటి మహిళను కొట్టడమే గాక దుర్భాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. 

శ్రీకాంత్ త్యాగి ఇంటిముందు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హౌసింగ్ సొసైటీ సంఘం 2019లోనే ఫిర్యాదు చేసింది. నోయిడా అధికారులు 2020లోనే త్యాగికి నోటీసులు జారీ చేశారు. ఇప్పుడు నేరుగా బుల్‌డోజర్లతో వెళ్లి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు.

అయితే యూపీలో ఇప్పటివరకు విపక్షాలకు చెందినవారినే లక్ష‍్యంగా చేసుకుని బుల్‌డోజర్లతో ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపణలొచ్చాయి. కానీ ఇప్పుడు బీజేపీ కార్యకర్త ఇంటిపైకే అధికారులు బుల్‌డోజర్ తీసుకెళ్లడం చర్చనీయాంశమైంది.
చదవండి: ఆలయంలో తొక్కిసలాట.. ముగ్గురు మహిళా భక్తులు మృతి..

మరిన్ని వార్తలు