రిసెప్షన్‌ స్టేజీపై బుల్లెట్‌ ఇవ్వాలని వరుడి డిమాండ్‌

22 May, 2021 14:59 IST|Sakshi
వరుడిపై దాడి చేస్తున్న వధువు కుటుంబసభ్యులు

లక్నో: ఘనంగా పెళ్లి జరిగింది. రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కొద్దిసేపట్లో ఫంక‌్షన్‌ ప్రారంభమవుతుందనగా వరుడు ఓ మెలిక పెట్టాడు. దానికి వధువు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. అయినా కూడా వరుడు పట్టుబట్టడంతో విసుగు చెందిన పెళ్లికూతురు పెళ్లి మండపంపైనే అతడి చెంప ఛల్లుమనిపించింది. ఈ ఘటనతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్‌ గ్రామానికి చెందిన నాసిమ్‌ అహ్మద్‌ కుమార్తెకు మహమ్మద్‌ ఇమ్రాన్‌ సాజ్‌తో మే 17వ తేదీన వివాహమైంది. బరాత్‌ అనంతరం విందు ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబై వేదికపై పెళ్లి కుమారుడు ఇమ్రాన్‌ సాజ్‌ కూర్చున్నాడు. అయితే ఈ సమయంలో వరకట్నం కింద తనకు బుల్లెట్‌ వాహనం ఇవ్వాలని వరుడు డిమాండ్‌ చేశాడు. అల్లుడి విజ్ఞప్తిని వధువు కుటుంబసభ్యులు తమకు కుదరదు.. అంత స్తోమత లేదని బతిమిలాడారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. 

ఇదంతా గమనిస్తున్న వధువు తీవ్ర ఆవేశానికి గురయ్యింది. వెంటనే వరుడి వద్దకు వెళ్లి చెంపపై కొట్టింది. రెండు, మూడుసార్లు చేయి చేసుకుంది. ఆమె చర్యను అభినందించిన గ్రామస్తులు వరుడి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన వరుడు విడాకులు కావాలని పట్టుబట్టారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

చదవండి: బైక్‌ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు
చదవండి:  జనం చస్తుంటే.. జాతర చేస్తారా..

మరిన్ని వార్తలు