Unlock: యూపీలో జూలై 5 నుంచి మరిన్ని సడలింపులు

2 Jul, 2021 19:01 IST|Sakshi

లక్నో: అన్‌లాక్‌ ప్రక్రియలో భాగంగా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని నిబంధనలు సడలించింది. సినిమా హాళ్లు, మల్టీపెక్సులు, క్రీడా మైదానాలు, జిమ్‌లు తెరిచేందుకు అనుమతించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ కార్యాలయం శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జూలై 5 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సడలింపులు అమల్లో వస్తాయని తెలిపింది. కోవిడ్‌-19 అదుపులోకి వచ్చిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా మహమ్మారి కారణంగా సినిమా హాళ్ల ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోయారని, సోమవారం నుంచి వారు థియేటర్లు తెరవవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది. 

అయితే, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. ​ తాజా సడలింపుల ప్రకారం... వారంలో ఐదు రోజుల పాటు 50 శాతం సామర్థ్యంతో.. ఉదయం 7 గంటల నుంచి జిమ్‌లు, సినిమా హాళ్లు, స్టేడియాలు తెరిచేందుకు అనుమతి ఉంటుంది. కాగా కోవిడ్‌ వ్యాప్తి నివారణ సంబంధిత కమిటీల చీఫ్‌లతో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ మంగళవారం సమావేశమయ్యారు. కోవిడ్‌ ప్రస్తుత పరిస్థితులపై ఆయన సమీక్ష నిర్వహించారు. 

ఈ క్రమంలో నిబంధనలు సడలించాలనే నిర్ణయానికి వచ్చిన సీఎం యోగి.. ప్రజావసరాలకు అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇక జూన్‌ 21 నుంచే 50 శాతం కెపాసిటీతో రెస్టారెంట్లు, మాల్స్‌ ఓపెన్‌ చేసేందుకు యోగి సర్కారు అనుమతించిన విషయం తెలిసిందే. కాగా గడిచిన 24 గంటల్లో యూపీలో 133 కేసులు వెలుగుచూడగా, 228 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య 58 మిలియన్లకు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ పాజిటివిటీ రేటు 0.05 శాతంగా ఉంది. 

>
మరిన్ని వార్తలు