యూపీ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్ కన్నుమూత

22 Aug, 2021 09:33 IST|Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ తొలితరం నాయకుడు కల్యాణ్‌ సింగ్‌ శనివారం రాత్రి కన్నుమూశారు. 89 ఏళ్ల కల్యాణ్‌ సింగ్‌ జూలై 4 నుంచి సంజయ్‌గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎస్‌జీపీజీఐ)లో చికిత్స పొందుతున్నారు. చేరినప్పటినుంచి ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

కానీ పలు అవయవాలు పనిచేయకుండా పోవడం, సెప్సిస్‌ (రోగనిరోధక వ్యవస్థ సొంత కణజాలంపై దాడి చేయడం)తో ఆయన మరణించారని ఎస్‌జీపీజీఐ తెలిపింది. కల్యాణ్‌ సింగ్‌ మృతి పట్ల ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. సమాజంలో బలహీన వర్గాలకు ఆయన గొంతుగా నిల్చారని ప్రస్తుతించారు.  

హిందుత్వానికి కేరాఫ్‌ అడ్రస్‌ 
‘‘యూపీ సీఎంగా నేను కూలిపోయే సమయంలో బాబ్రీ కూలిపోవడం విధి రాత. మసీదు కూలిపోకపోతే కోర్టులు ఎప్పటికీ యథాతధ స్థితి కొనసాగించేవి. ఏదైనా మందిరం పూర్తయ్యాక చూడాలన్నది నా ఆశ’’ అని 2020 ఆగస్టులో అయోధ్య రామమందిర భూమిపూజ సందర్భంగా కల్యాణ్‌సింగ్‌ వ్యాఖ్యానించారు. కానీ ఆ ఆశ తీరకుండానే మరణించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా కల్యాణ్‌ రెండుమార్లు పనిచేశారు. పది అసెంబ్లీ ఎన్నికల్లో 9సార్లు ఆయన గెలుపొందారు.

రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో సభ్యుడిగా ఉన్నారు. తర్వాత జనసంఘ్‌లో అనంతరం బీజేపీలో కీలక పాత్ర పోషించారు. ఏ పార్టీలో ఉన్నా హిందూవాదాన్ని బలంగా వినిపించేవారు. తొలిసారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన జరిగింది. దాంతో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, కేంద్రం యూపీ అసెంబ్లీని రద్దు చేసింది. అనంతరం 1997లో ఆయన రెండో దఫా ముఖ్యమంత్రి అయ్యారు.

లక్నో కార్పొరేటర్‌ కుసుమ్‌ రాయ్‌ ప్రభుత్వ వ్యవహారాలను శాసిస్తున్నారని సొంత ఎమ్మెల్యేల నుంచే అసమ్మతి పెరగడంతో 1999 నవంబరులో బీజేపీ హైకమాండ్‌ ఆయన్ను సీఎం పదవి నుంచి తొలగించింది. తర్వాత పార్టీ నుంచి బహిష్కరించింది. కల్యాణ్‌ సింగ్‌ 2010లో జనక్రాంతి పార్టీ పేరిట సొంత కుంపటి పెట్టుకున్నారు. 2014లో తిరిగి బీజేపీలో చేరారు. అదే సంవత్సరం ఆయన్ను రాజస్తాన్‌ గవర్నర్‌గా నియమించారు.

మరిన్ని వార్తలు