Yogi Adityanath: మత ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం

21 Apr, 2022 14:01 IST|Sakshi

లక్నో: ఇక నుంచి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్‌ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ వెల్లడించారు. అంతేగాక ప్రార్ధనా ప్రాంగణం నుంచి శబ్ధం బయటకు రాకూడదని తెలిపారు. లౌడ్‌ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలకు తగిన విధంగా ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించిన మూడు రోజుల తర్వాత యూపీలో యోగి ఈ ప్రకటన చేశారు. ఆజాన్‌ సమయంలో 15 నిమిషాలు ముందు, తరువాత లౌడ్‌ స్పీకర్ల ద్వారా హనుమాన్‌ చాలీసా, భజనలు ప్లే చేయరాదని నాసిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక మహారాష్ట్రలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు మే 3లోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. 
చదవండి: మత ఘర్షణల నేపథ్యంలో.. యోగి సర్కార్‌ కీలక నిర్ణయం

కాగా ఇప్పటికే యోగి సర్కార్‌ మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై యూపీలో  మత పరమైన ర్యాలీలకు పోలీసులకు అఫిడవిట్‌ను సమర్పించాలని సీఎం తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ఊరేగింపు జరగకూడదని పేర్కొన్నారు. సాంప్రదాయ మతపరమైన ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిపారు.

మరిన్ని వార్తలు