‘నా భార్యకు గుక్కెడు నీళ్లవ్వలేదు.. వాళ్లే చంపేశారు’

28 Apr, 2021 17:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వైరలవుతోన్న ఎస్సై ఆవేదన

లక్నో: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వల్ల నా భార్య చనిపోలేదు సార్‌. డాక‍్టర్లే నా భార్యను చంపేశారు. 50 సార్లు ఆస్పత్రి సూపరిటెండెంట్‌ దగ్గరికి వెళితే పట్టించుకోలేదు. చివరికి తాగడానికి గుక్కెడు మంచి నీళ్లు లేక తను మరణించిందంటూ భార్యను కోల్పోయిన ఓ ఎస్సై కన్నీరుమున్నీరవుతున్నాడు. ప్రస్తుతం ఈ హృదయవిదారకర ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

నేషనల్‌ మీడియా కథనం ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌లో ఓ స్టేషన్‌ ఎస్సైగా పనిచేస్తున్న భిక్ చంద్ భార్య రూపమతికి కరోనా సోకింది. దీంతో భిక్ చంద్ అత్యవసర చికిత్స కోసం భార్యను ముజఫర్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. ఆస్పత్రిలో జాయిన్‌ అయిన రెండు రోజుల తరువాత ఆమె మరణించింది. అయితే ఆమె మరణానికి కరోనా కారణం కాదని, డాక్టర్ల నిర్లక్ష్యమేనంటూ ఎస్సై భిక్‌ చంద్‌ సోషల్‌ మీడియాలో వాపోయాడు.

‘‘నా భార్యకు కనీసం తాగడానికి గుక్కెడు మంచి నీళ్లవ్వలేదు.. వైద్యులు ఎవరు ఆమెను పట్టించుకోలేదు. చివరికి మరణించింది. నా భార్యను చంపింది కరోనా కాదు.. వైద్యులు.. వారి నిర్లక్షమే’’ అంటూ ఈ వైరల్‌ వీడియోలో ఎస్సై భిక్‌ చంద్‌ తన భార్య విషయంలో జరిగిన అన్యాయాన్ని వివరించే ప్రయత్నం చేశాడు. ‘‘నా భార్యకు ఊపిరి ఆడలేదు. ఆక్సిజన్‌ ఇవ్వాల్సిందిగా వైద్యులను అభ్యర్థించాను. ట్యాబ‍్లెట్స్‌ ఇవ్వలేదు. నేను సూపరిటెండెంట్‌ను 50 సార్లు కలిశా. నేను ఎస్సై అని చెప్పినా కూడా ఫలితం లేకపోయింది.. చివరికి ప్రాణాల్ని కోల్పోయింది. తనకు సరైన ట్రీట్మెంట్‌ ఇవ్వలేదు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే నాభార్య చనిపోయింది’’ అంటూ వాపోయాడు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరలవ్వడంతో సదరు ఆస్సత్రి సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ముజఫర్ నగర్ మెడికల్ కాలేజ్‌ ప్రిన్సిపాల్ డాక్టర్ బ్రిగేడియర్ జిఎస్ మంచంద మాట్లాడుతూ ‘‘ఎస్పై భార్యకు ఊపిరితిత్తులు పాడయ్యాయి, టైప్ డయాబెటిస్, రక్తపోటు సమస్యలున్నాయి. దీంతో పాటు తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉంది. పరిస్థితి విషమించడంతో ఆమె మరణించింది. ట్రీట్మెంట్‌ విషయంలో ఆమె పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించలేదు’’ అని తెలిపాడు. 

చదవండి: వైరల్‌: ‘కరోనా కాదు.. ఫ్యాన్‌ చంపేసేలా ఉంది’

మరిన్ని వార్తలు