మెడలో విష సర్పంతో అతిచేష్టలు.. నిండు ప్రాణం బలి!

22 Aug, 2022 13:13 IST|Sakshi

లక్నో: పాములు పట్టేవాడు.. ఏదో ఒకనాడు దాని కాటుకే బలవుతాడంటారు. ఇది నిజమని నిరూపించింది ఇక్కడో ఘటన. ఊరిలో పాములు పట్టి వాటిని కాపాడే యత్నం చేసే ఓ వ్యక్తి.. తన ‘అతి’ చేష్టలతో, నిర్లక్ష్యంతో దాని కాటుకే ప్రాణం పొగొట్టుకున్నాడు. 

ఉత్తర ప్రదేశ్‌ షాజహాన్‌పూర్‌ జిల్లా పరిధిలోని జైతీపూర్‌ గ్రామంలో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. దేవేంద్ర మిశ్రా అనే వ్యక్తి అప్పుడప్పుడు గ్రామంలో, చుట్టుపక్కల ఊళ్లలో ఇళ్లలో దూరిన పాముల్ని పట్టి.. వాటిని ఊరి బయట అడవుల్లో సురక్షితంగా వదిలేస్తుంటాడు. ఈ క్రమంలో తాజాగా రవీంద్ర అనే వ్యక్తి ఇంట్లో కట్లపాము దూరిందన్న సమాచారం అందుకున్నాడు. ఆ విష సర్పాన్ని ఓ కర్ర సాయంతో అతి సులువుగా పట్టుకుని.. దానితో ఊరంతా కలియదిరిగాడు. 

అక్కడితో ఆగకుండా దానిని ఓ చిన్నారి మెడలో వేసి ప్రదర్శించి.. ఆపై తన మెడలోనూ వేసుకుని ఊరంతా తిరిగాడు. అలా రెండు గంటలు గడిచిన తర్వాత.. పాము తల పట్టుసడలి అతన్ని కాటేసింది. వెంటనే దానిని మళ్లీ బంధించి.. ఓ కుండలో బంధించాడు. 

అయితే ఆస్పత్రికి వెళ్లకుండా.. ఆకు పసర్లతో గాయానికి చికిత్స చేసుకున్నాడు అతను. ఆపై ఇంటికి చేరుకుని పడుకున్నాడు. పాము మరీ విషపూరితం కావడంతో.. అవేం పని చేయక అతని ప్రాణం పోయింది. అటు కుండ కింద ఉంచిన పాము కూడా చచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. సకాలంలో వైద్యం అంది ఉంటే అతని ప్రాణం దక్కేదని వైద్యులు చెప్తున్నారు.

ఇదీ చదవండి: లాడ్జిలో రిమాండ్‌ ఖైదీ సరసాలు

మరిన్ని వార్తలు