Uttarakhand: రిసెప్షనిస్ట్‌ అంకిత కుటుంబానికి రూ.25లక్షల ఆర్థిక సాయం

28 Sep, 2022 13:56 IST|Sakshi

దెహ్రాదూన్‌: ఉత్తరాఖండ్‌లో హత్యకు గురైన రిసెప్షనిస్ట్ అంకిత భండారీ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించారు సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆమె తల్లిదండ్రులకు రూ.25లక్షలు అందించాలని ఆదేశించారు. ఉత్తరాఖండ్ సీఎం కార్యాలయం ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

అలాగే అంకిత కుటుంభానికి త్వరగా న్యాయం జరిగేందుకు ఆమె హత్య కేసును ఫాస్ట్ ట్రాక్‌ కోర్టుతో విచారణ జరిపించాలని ధామీ న్యాయస్థానాన్ని కోరినట్లు సీఎంఓ తెలిపింది. అంకిత తండ్రితో సీఎం మంగళవారం ఫోన్లో మాట్లాడారు. ఈ కేసు విచారణను వేగంగా జరిపించి నిందితులకు కఠినశిక్ష పడేలా చేస్తామని హామీ  ఇచ్చారు. ఆ మరునాడే పరిహారం ప్రకటించారు.

మరోవైపు అంకిత హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిందితులకు చెందిన గ్రే యాక్టివా, బ్లాక్‌ పల్సర్‌ బైక్‌లను స్వాధీనం చేసుకుంది. వీటిని ఉపయోగించే అంకితను కాలువ దగ్గరకు తీసుకెళ్లి ఆ తర్వాత అందులోకి తోసేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

బీజేపీ నుంచి సస్పెండైన వినోద్ ఆర్య కుమారుడు అంకిత్‌ ఆర్య ఈ హత్య కేసులో  ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన రిసార్డులో రిసెప్షనిస్ట్‌గా పనిచేసే ఆమెను మరో ఇద్దరు సిబ్బందితో కలిసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురినీ అరెస్టు చేశారు. ఈ హత్య ఉత్తరాఖండ్‌లో తీవ్ర దుమారం రేపింది. మరోవైపు ఈ రిసార్టులో వ్యభిచారం నిర్వహించేవారని, ఆ కూపంలోకి దిగేందుకు నిరాకరించడం వల్లే అంకితను హత్య చేశారని సిట్ దర్యాప్తులో తేలింది.
చదవండి: అది రిసార్ట్‌ కాదు.. వ్యభిచార కూపం!

మరిన్ని వార్తలు