ఉత్తరాఖండ్‌ జలవిలయం: ఓ కుక్క కథ!

11 Feb, 2021 16:49 IST|Sakshi
భుటియా జాతి కుక్క

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో జలవిలయం సంభవించి నాలుగు రోజులు గడుస్తోంది. ఎన్‌టీపీసీ హైడల్‌ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకున్న వారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్‌ వద్ద ఉంటున్న ఓ నల్లకుక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ప్రాంతం, సొరంగం‌లో ఇరుక్కుపోయిన జనం, మొత్తం సంఘటనతో కుక్కకున్న సంబంధాన్ని తెలుసుకున్న వారి కళ్లు చెమర్చుతున్నాయి.

తెలిసిన వారి కోసం మూడు రోజులుగా..
రెండేళ్ల భుటియా జాతికి చెందిన నల్ల కుక్క తపోవన్‌ విష్ణుగాడ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే జన్మించింది. అదే ప్రాంతంలోనే పెరిగింది. ప్రాజెక్టు పనులు చేస్తున్న వారు పెడితే తిని, వారివెంటే తిరిగేది. ప్రమాదం జరిగిన ఆదివారం రాత్రి రోజూలాగే కుక్క ఆ ప్రాంతంలో కాకుండా కిందున్న వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఆ తర్వాతే వరద ప్రాజెక్టును ముంచెత్తింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారు నీటిలో కొట్టుకుపోయారు. దాదాపు 25-35 మంది దాకా సొరంగంలో ఇరుక్కుపోయారు. ( అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు )

కుక్క తిరిగొచ్చి చూసే సరికి దానికి తెలిసిన వారెవరూ కనిపించలేదు. ఆ ప్రాంతం మొత్తం కొత్తవాళ్లతో నిండిపోయి ఉంది. సహాయక చర్యలు చేపడుతున్న వారు దాని గురించి తెలియక.. అక్కడికి వచ్చిన ప్రతీసారి దాన్ని తరిమేయటం మొదలుపెట్టారు. కానీ, అది మళ్లీ మళ్లీ అక్కడికి వచ్చేది. అయితే కొందరు వ్యక్తులు ఆ నల్లకుక్కను చాలా సార్లు ఇదే ప్రాంతంలో చూశామని, వారికి దాని కథ మొత్తం చెప్పారు. దీంతో అప్పటినుంచి సహాయక సిబ్బంది దానికి తినడానికి తిండి పెడుతూ, రాత్రిళ్లు పడుకోవటానికి గోనె సంచి ఏర్పాటు చేశారు. తన వాళ్లు ఎప్పుడైనా తిరిగొస్తారన్న ఆశతో రాత్రి, పగళ్లు సొరంగం బయటే వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది.  (జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ?  )

మరిన్ని వార్తలు