జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ? 

10 Feb, 2021 01:17 IST|Sakshi
రాత్రిపూట సైతం తపోవన్‌ సొరంగ మార్గం వద్ద కొనసాగుతున్న అన్వేషణ 

ఉత్తరాఖండ్‌లో సాయం.. ముమ్మరం 

31కి చేరుకున్న మృతుల సంఖ్య 

ముఖ్యమంత్రి రావత్‌ ఏరియల్‌ సర్వే

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ జల విలయంలో మృతుల సంఖ్య 31కి చేరుకుంది. విద్యుత్‌ ప్రాజెక్టు సొరంగ మార్గంలో చిక్కుకున్న కార్మికుల్ని కాపాడడానికి సహాయ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. మంగళవారం నాడు మరో అయిదు మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 175 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. రైణి గ్రామంలోని శిథిలాల్లో రెండు మృతదేహాలు లభించినట్టుగా నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) అధి కారి ఒకరు చెప్పారు. గల్లంతైన వారంతా ఎన్‌టీపీసీకి చెందిన నిర్మాణంలో ఉన్న తపోవన్‌–విష్ణుగఢ్, రిషిగంగ విద్యుత్‌ ప్రాజెక్టుల్లో పని చేస్తున్నవారు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలే ఉన్నారు. 

శిథిలాలు తొలగించడానికి భారీ మిషన్లు  
12 అడుగుల ఎత్తు, 2.5 కి.మీ. పొడవైన సొరంగ మార్గంలో వరద నీటిలో కార్మికులు చిక్కుకొని ఉండడంతో సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. ఐటీబీపీ, ఎన్‌డీఆర్‌ఫ్‌లతో పాటు రాష్ట్ర సహాయ సిబ్బంది ఆ సొరంగ మార్గంలోని శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద పెద్ద యంత్రాలను తీసుకువచ్చి విరామమెరుగకుండా పని చేస్తున్నారు. ‘‘రాత్రి నుంచి నిరంతరాయంగా పని చేస్తూ ఉంటే సొరంగ మార్గంలో 120 మీటర్ల వరకు శిథిలాలను తొలగించగలిగాం’’అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్‌ కుమార్‌ పాండే చెప్పారు. ఇక వంతెనలు ధ్వంసం కావడంతో పలు గ్రామాలకు రాకపోకలు తెగిపోయాయి. మొత్తం 13 గ్రామాలకు చెందిన 2,500 మంది బిక్కు బిక్కుమంటూ ఉన్నారు. వారందరికీ హెలికాప్టర్ల ద్వారా నిత్యావసర సరుకుల్ని అందిస్తున్నారు.  

సీఎం ఏరియల్‌ సర్వే  
వరద గుప్పిట్లో చిక్కుకున్న ప్రాంతాన్ని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జోషిమఠ్‌లోని ఐటీబీపీ ఆస్పత్రిని సందర్శించారు. మరణం అంచుల వరకు వెళ్లి సురక్షితంగా వచ్చిన 12 మంది కార్మికులతో మాట్లాడారు. సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికే తాము ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా సీఎం తెలిపారు. వరద ప్రాంతాల్లో చికక్కుకున్న కొన్ని గ్రామాల్ని కూడా సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు.  

ఆ పరికరమే కొంప ముంచిందా ..? 
1960 దశకంలో చైనాపై నిఘా కోసం నందాదేవి పర్వత ప్రాంతాల్లో అమర్చడానికి తీసుకువెళ్లిన అణు ధార్మిక పరికరం ఇప్పుడు జలవిలయానికి దారి తీసిందని రైణి గ్రామస్తులు అనుమానిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన రోజు భయంకరమైన వాసన వచ్చిందని, ఆ సమయంలో ఊపిరి తీయడం కష్టంగా మారిందని వరద బీభత్సంలో అత్యధికంగా నష్టపోయిన రైణి గ్రామవాసులు చెబుతున్నారు. కేవలం మంచుపెళ్లలు, శిథిలాల వల్ల అంత ఘాటైన వాసన రాదని ఆ పరికరం నందాదేవి పర్వత ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందని తమ పెద్దలు చెబుతూ ఉండేవారని, బహుశా దాని కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని దేవేశ్వరి దేవి అనే మహిళ అనుమానం వ్యక్తం చేశారు.

నందాదేవి పర్వత ప్రాంతాల్లో ఇలాంటి పరికరం ఏదో ఉందని ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. చైనా కదలికలపై నిఘా ఉంచడానికి సీఐఏ, ఐబీలు సంయుక్తంగా అణు శక్తి కలిగిన ఒక పరికరాన్ని నందాదేవి పర్వతాల్లో అమర్చడానికి 1965లో తీసుకువెళ్లారని, అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ పరికరాన్ని అక్కడే వదిలేసి వచ్చారని అంటారు. ఏడాది తర్వాత ఒక పర్వతారోహక బృందం అక్కడికి వెళ్లి చూస్తే ఆ పరికరం కనిపించలేదు. గల్లంతైన ఆ పరికరం జీవిత కాలం వందేళ్ల వరకు ఉంటుందని అంచనా. అయితే దీనిపై అధికారికంగా వివరాలు లేవు. 

రాళ్ల కుప్ప పడిపోయిందా ? 
ఉత్తరాఖండ్‌లో నందాదేవి పర్వత శ్రేణుల్లోని రాళ్ల కుప్ప బలహీనపడి కుప్పకూలిపోవడంతో ఉత్తరాఖండ్‌ వరద బీభత్సంలో చిక్కుకొని ఉండవచ్చునని వాడియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జువాలజీ (డబ్ల్యూఐహెచ్‌జీ) అంచనా వేసింది. పర్వతంలోని రాళ్లు ఏళ్ల తరబడి మంచుతో కప్పబడి ఉండడంతో బాగా నాని బలహీనపడి ఉండవచ్చునని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మంచు చరియలు విరిగిపడిన ప్రాంతంలో హెలికాప్టర్‌ ద్వారా సర్వే నిర్వహించిన శాస్త్రవేత్తలు రాళ్ల కుప్ప బలహీనపడడమే వరదలకు కారణమని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ కలచంద్‌ సెయిన్‌ చెప్పారు. ఈ పర్వత ప్రాంతం అత్యంత లోతున ఏటవాలుగా ఉంటుందని అందువల్ల మంచు చరియలు కరిగి పడిపోగానే వరదలు పోటెత్తాయని తెలిపారు.
చదవండి: (విలయం మిగిల్చిన విషాదం)

మరిన్ని వార్తలు