VIRAL PIC: మంత్రి గారు మాస్క్‌ ముఖానికి పెట్టుకోవాలి.. అక్కడ కాదు..!

15 Jul, 2021 20:02 IST|Sakshi

డెహ్రాడూన్‌: కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలంటూ ఆరోగ్య నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ, చాలా మంది ఆ మాటలను పెడచెవిన పెట్టి మాస్క్‌ల వాడకానికి మంగళం పాడుతున్నారు. సాధారణ ప్రజల పరిస్థితి ఇలా ఉంటే.. పదిమందికీ చెప్పాల్సిన మంత్రులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వ్యాప్తికి కారకులవుతున్నారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ మంత్రి అయితే మాస్క్‌ను ముఖానికి కాకుంగా కాలి బొటన వేలికి తగిలించి ఓ ముఖ్యమైన భేటీలో దర్శనమిచ్చారు. సదరు మంత్రి గారి నిర్వాకానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లో బీజేపీకి చెందిన ఐదుగురు నేతలు ఓ సమావేశంలో పాల్గొన్నారు. అందులో ముగ్గురు రాష్ట్ర మంత్రులు కూడా ఉన్నారు. అయితే వీరిలో ఏ ఒక్కరికీ మాస్క్‌లు లేవు. వీరిలో యతీశ్వరానంద్‌ అనే మంత్రి అయితే మాస్క్‌ను ఏకంగా కాలి బొటన వేలికి తగిలించి సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోను ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి గరిమా దాసౌని ట్విటర్‌లో పోస్టు చేశారు. ''ఇదీ అధికార భాజపా మంత్రుల పరిస్థితి. వీరంతా మాస్క్‌లు పెట్టుకోని వారిని శిక్షించమని చెబుతారు'' అంటూ విమర్శించారు. మాస్క్‌ పెట్టుకోవడానికి ఏది సరైన చోటో ఉత్తరాఖండ్‌ మంత్రిని అడిగి తెలుసుకోండి అంటూ ఆప్‌ నేత దీప్‌ ప్రకాశ్‌ పంత్‌ కామెంట్‌ చేశారు. దీనిపై ప్రస్తుతం విపక్షాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరిన్ని వార్తలు