ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం

31 Jul, 2020 10:09 IST|Sakshi

ఉత్తరాఖండ్‌లో ఘటన

డెహ్రాడూన్‌: కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే హరీష్‌ ధామీకి పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పి ఏరులో పడిపోయిన ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనుచరులు సకాలంలో స్పందించడంతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఉత్తరాఖండ్‌లో గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్నభారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పితోరాఘర్‌ జిల్లాలోని ధార్చులా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న హరీష్‌ ధామి వరద బాధితులను పరామర్శించేందుకు లుమ్తీ గ్రామానికి వెళ్లారు. 

అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో ఏరు దాటే క్రమంలో అదుపు తప్పి నీళ్లలో పడిపోయారు. వరద ఉధృతి తీవ్రంగా ఉండటంతో అందులో కొట్టుకుపోయారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో స్వల్పగాయాలతో ఎమ్మెల్యే బయటపడ్డారు. ఈ విషయం గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన హరీష్‌ ధామి.. లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కొండప్రాంతాల నుంచి కొట్టుకువస్తున్న చెత్తాచెదారం, వరద నీటితో అవస్థలు పడుతున్నారని చెప్పుకొచ్చారు. నీట మునిగిన ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు చేర్చేందుకు విమానాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు