కన్నకొడుకు మీదే కోర్టుకెక్కారు.. ఇంతకీ వీళ్లకు ఏం కావాలో తెలుసా?

11 May, 2022 18:52 IST|Sakshi

డెహ్రాడూన్‌: పిల్లలను కనడంతోనే తల్లిదండ్రుల బాధ్యత ముగిసిపోదు. వాళ్లను పెంచి.. విద్యాబుద్ధులు నేర్పించి.. ఉన్నతస్థానానికి చేర్చే దాకా సాగుతూనే ఉంటుంది వాళ్ల ప్రయాణం. మరి ఆ తర్వాత.. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు కూడా అంతే బాధ్యతతో వ్యవహరిస్తుంటారా?. ఇక్కడ వయసుపైబడ్డ ఓ పెద్దాయన, ఆయన భార్య.. సొంత కొడుకు, కోడలి మీద కోర్టుకు ఎక్కారు. ఎందుకో తెలుసా? తమకు ఓ మనవడినో, మనవరాలినో ఇవ్వమని!

ఆశ్చర్యంగా అనిపించే ఈ కేసు ఉత్తరాఖండ్‌లో ఇవాళ(బుధవారం) చోటు చేసుకుంది. ఏడాదిలోగా మనవడో, మనవరాలినో తమ చేతుల్లో పెట్టాలని.. లేకుంటే ఐదుకోట్ల రూపాయల పరిహారం చెల్లించాలని కోర్టుకెక్కారు హరిద్వార్‌కు చెందిన ఆ జంట. 2016లో మా అబ్బాయికి వివాహం చేశాం. ఇప్పటిదాకా పిల్లల్ని కనలేదు. ఆడామగా అనే తేడా లేదు. ఎవరో ఒకరిని కనిస్తే చాలు.. అని అంటోంది ఆ జంట. మరి ఇక్కడ డబ్బు ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటారా?. తల్లిదండ్రుల పట్ల ఆ కొడుకు ఎంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాడో సమాజానికి తెలియజేయడానికే అలా చేశారట!. 

మా దగ్గర ఉన్నదంతా మా అబ్బాయి కోసమే ఖర్చు చేశాం. అమెరికాలో చదివించాం. ఘనంగా పెళ్లి చేశాం.  ఆపై బ్యాంక్‌ లోన్‌ తీసుకుని ఇల్లు కట్టాం. ఇప్పుడు మా దగ్గర పైసా లేదు. ఆర్థికంగా చితికిపోయి ఉన్నాం. అందుకే కొడుకు కోడలు నుంచి చెరో రెండున్నర కోట్ల రూపాయలు డిమాండ్‌ చేస్తూ పిటిషన్‌ వేశాం అంటున్నారు ఎస్‌ఆర్‌ ప్రసాద్‌. ‘‘మనం పిల్లల కోసం లెక్కలేసుకోం. మంచి ఉద్యోగాలకు తోడ్పాడు అందిస్తాం. తల్లిదండ్రులుగా అది బాధ్యత. కానీ, పిల్లలు మాత్రం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కష్టకాలంలో కనీస అవసరాలకు కూడా డబ్బులివ్వడం లేదు. మనవడో మనవరాలో కావాలని కేసు వేయడం వెనుక వాళ్ల ప్రధాన ఉద్దేశం.. అందరి దృష్టిని ఆకర్షించడమే’’ అంటున్నారు ప్రసాద్‌ తరపు లాయర్‌ శ్రీవాస్తవ.

మరిన్ని వార్తలు