Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. 34 మంది మృత్యువాత

19 Oct, 2021 20:20 IST|Sakshi

ఉత్తరాఖండ్‌ వర్షాలు అప్‌డేట్స్‌:

► రాష్ట్రంలోని భారీ వర్షాలతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 34కు చేరింది. మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

► వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ధామి ఏరియల్‌ సర్వే చేపట్టారు.

► వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్‌ 15 బృందాలను నియమించింది.

►వరద ప్రభావిత ఉత్తరాఖండ్‌లో భారత వైమానిక దళం రెస్క్యూ మిషన్‌ను నిర్వహిస్తోంది.

►నైనిటాల్ సరస్సు పొంగిపొర్లుతుంది. ఇప్పటి వరకు కనీసం 24 మంది చనిపోయారు., రోడ్లు, ఇళ్లు కొట్టుకుపోయాయి

డెహ్రాడూన్‌: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని న‌దులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తుండగా, పలు ప్రాంతాల్లో ఇళ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. కొన్ని ప్రదేశాల్లో కొండచరియలు విరిగిపడగా…వరద ఉద్ధృతికి ఇళ్లు, బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. కాగా గత మూడు రోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.
చదవండి: ఉత్తరాఖండ్‌ వర్షాలు: నైటిటాల్‌తో సంబంధాలు కట్‌

అయితే ఇప్పటి వరకు కురిసిన భారీ వర్షాలతో 34 మంది మృత్యువాతపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ .4 లక్షల పరిహారం అందించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. మృతుల్లో నేపాల్‌కు చెందిన కూలీలు కూడా ఉన్నారు. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. ఇక చంపావ‌త్‌లో ఓ ఇళ్లు కూల‌డం వ‌ల్ల మ‌రో ఇద్ద‌రు మృతిచెందారు. మూడు ఆర్మీ హెలీక్యాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

కాగా నైనిటాల్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు నైనిటాల్‌ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. అధిక నీటి ప్రవాహంతో చల్తి నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కొట్టుకుపోయింది. అదే విధంగా హల్​ద్వానీలోని గౌలా నది ఉద్ధృతికి అక్కడి వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వంతెన మీదకు రావడాన్ని గమనించిన స్థానికులు, అధికారులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో ప్రమాదం తప్పింది.

మరోవైపు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీ యువతులను సహాయ బృందాలు కాపాడాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ కోసం వెళ్లిన సుష్మ, ఆమె స్నేహితులు వరదల్లో చిక్కుకుపోగా.. తమ పరిస్థితి గురించి తెలంగాణ సీఎంవో, కేంద్ర మంత్రులకు ట్వీట్ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఉత్తరాఖండ్‌ అధికారులతో మాట్లాడిన మంత్రి సహాయక చర్యలకు ఆదేశించారు. దీంతో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. అనంతరం వీరు తమ వాహనంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.

కాగా, ఉత్తరాఖండ్ వర్షాలు, వదర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామి, కేంద్రమంత్రి అజయ్ భట్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు