సుప్రీం, హైకోర్టుల్లో ఖాళీగా జడ్జీ పోస్టులు

17 May, 2021 15:34 IST|Sakshi

కొలీజియం సిఫారసుల కోసం ఎదురుచూస్తున్నాం

కేంద్ర ప్రభుత్వం వెల్లడి

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసేందుకు గాను కొలీజియం సిఫారసుల కోసం ఎదురు చూస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉండగా, రెండు హైకోర్టులు శాశ్వత ప్రధాన న్యాయమూర్తులు లేకుండానే నడుస్తున్నాయని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్లో ఇద్దరు ఒకటిన్నర నెలల్లో రిటైర్‌ కానున్నారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అవసరమైన సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు. 

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్, జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు(సీజేఐ)లుగా రిటైర్‌ కాగా, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ భానుమతి, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఇందూ మల్హోత్రా పదవీ విరమణ చేశారు. మరో న్యాయమూర్తి ఎం.శంతను గౌడర్‌ గత నెలలో కన్నుమూశారని ఆయన తెలిపారు. దీంతో సుప్రీంకోర్టులో 34 జడ్జీలకుగాను ప్రస్తుతం 27 మందే ఉన్నారని చెప్పారు. కోల్‌కతా, అలహాబాద్‌ హైకోర్టులు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులతోనే నడుస్తున్నాయన్నారు. దేశంలోని 25 హైకోర్టుల్లో కలిపి 1,080 జడ్జీలకు గాను ప్రస్తుతం 660 మంది ఉన్నారని చెప్పారు. పదోన్నతులు, రాజీనామాలు, పదవీ విరమణల కారణంగా జడ్జీల పోస్టుల్లో ఖాళీలు పెరుగుతున్నాయని తెలిపారు. హైకోర్టులలో న్యాయమూర్తుల నియామకం కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థల మధ్య నిరంతరం సహకార ప్రక్రియ అని ఆయన పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారం.. సుప్రీంకోర్టు జడ్జీలు, 25 హైకోర్టు జడ్జీల నియామకానికి సంబంధించిన పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించాక కేంద్రం ఆ సిఫారసులకు ఆమోదం తెలపవచ్చు లేదా పునఃపరిశీలనకు తిప్పి పంపవచ్చు. హైకోర్టులో జడ్జీల ఖాళీలపై హైకోర్టు కొలీజియం తన సిఫారసులను ముందుగా న్యాయ శాఖకు అందజేస్తుంది. ఇంటెలిజెన్స్‌ బ్యూరో నివేదికలను వాటికి జత చేసి, ఆ సిఫారసులను న్యాయశాఖ తిరిగి సుప్రీం కోలీజియంకు పంపిస్తుంది. సీజేఐతోపాటు నలుగురు అత్యంత సీనియర్‌ జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియంలో ఉంటారు.  

ఇక్కడ చదవండి:

2-డీజీ మొత్తం ప్రపంచాన్ని కాపాడుతుంది: కేంద్ర ఆరోగ్య మంత్రి

Ambulance Couple: పెళ్లి బహుమతిగా అంబులెన్స్‌!

>
మరిన్ని వార్తలు