వ్యాక్సినేషన్‌.. ఊళ్ల మధ్య చిచ్చు!

24 May, 2021 08:50 IST|Sakshi
వ్యాక్సినేషన్‌ సెంటర్‌ దగ్గర కాపలా కాస్తున్న జాజోద్‌ గ్రామస్తులు

వెబ్‌డెస్క్‌: వ్యాక్సిన్‌లు దొరక్క జనాలు అల్లలాడిపోతున్నారు. ఇప్పటికే మొదటి డోస్‌లు తీసుకున్నవాళ్లకు రెండో డోస్‌ దొరకడం కష్టతరంగా మారింది. దీనికి తోడు ఏజ్‌ గ్రూపులు, ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌, టోకెన్‌ వ్యవస్థ, రోజూ కొందరికే టీకాలు ఇవ్వాలన్న అధికారుల నిర్ణయాలు జనాలకు చికాకు తెప్పిస్తున్నాయి. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊళ్ల మధ్య చిచ్చు పెడుతున్న ఘటనలు రాజస్థాన్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయి. 

సికర్‌ జిల్లా జాజోద్‌ గ్రామంలో శనివారం ఉదయం ప్రభుత్వ పాఠశాలలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరగాల్సి ఉంది. దీంతో ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేసుకున్న ఎనభై మంది సెంటర్‌ ముందు క్యూ కట్టారు. అయితే అందులో సగం కంటే ఎక్కువ బయటి ఊళ్ల వాళ్లే ఉన్నారు. ఇది గమనించిన జాజోద్‌ గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తూ.. బయటి ఊళ్లవాళ్లకు వ్యాక్సిన్‌ డోస్‌లు ఇవ్వకుండా ఆశావర్కర్లను అడ్డుకున్నారు. మరోవైపు కొందరు గ్రామస్తులు.. బయటి ఊళ్ల వాళ్లతో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మళ్లీ మధ్యాహ్నం టైంలో మళ్లీ వ్యాక్సినేషన్‌ మొదలుపెట్టగా.. బయటి ఊళ్లవాళ్లు అక్కడి నుంచి కదల్లేదు. దీంతో మూడు గంటల తర్వాత మళ్లీ వ్యాక్సినేషన్‌ ప్రారంభించారు. మొత్తం 90 డోస్‌లలో ముప్ఫై మాత్రమే తమ ఊరివాళ్లకు ఇచ్చి.. మిగతావి బయటి వాళ్లకు ఇచ్చారని జాజోద్‌ సర్పంచ్‌ భర్త మహవీర్‌ చెబుతున్నాడు. వాళ్లంతా చురు, బికనీర్‌, నాగౌర్‌ గ్రామాల నుంచి వచ్చారని, సోమవారం నుంచి బయటివాళ్లను అడ్డుకుని తీరతామని జాజోద్‌ గ్రామస్తులు చెప్తున్నారు. 

ఆధార్‌ వల్లే..
రాజస్థాన్‌లో ప్రస్తుతం 18 నుంచి 44 ఏళ్లలోపు వాళ్లకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నడుస్తోంది. గ్రామాల్లో వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉంటోంది. దీంతో జనాలు వ్యాక్సిన్‌ కోసం ఎగబడుతున్నారు. ఒక ఊరి వాళ్లు.. మరో ఊరికి వ్యాకిన్‌ కోసం వెళ్తుండడంతో తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. టోంక్‌ జిల్లాలో కొన్ని గ్రామాల ప్రజలు బయటి వాళ్లు వ్యాక్సినేషన్‌కు రాకుండా పొలిమేర్లలో రాళ్లు అడ్డం పెట్టడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. చాలామందికి ఆన్‌లైన్‌ స్లాట్‌ బుకింగ్‌ గురించి అవగాహన లేకపోవడంతో నేరుగా సెంటర్ల దగ్గర క్యూ కట్టి, వెనుదిరుగుతున్నారు. మీడియేటర్ల సాయంతో స్లాట్‌ బుక్‌ చేసుకున్నప్పటికీ.. ఆధార్‌లో వయసు తేడాలున్నాయని ఆశావర్కర్లు వ్యాక్సిన్‌ డోసులు ఇవ్వడం లేదు. వీటన్నింటిని తోడు టోకెన్‌ సిస్టమ్‌ నడుస్తుండడంతో వ్యాక్సిన్‌ డోస్‌లు త్వరగా తీసుకోవాలనే ఉద్దేశంతో వేరే ఊళ్లకు వెళ్తున్నారు.

చదవండి: 160 మంది ప్రాణాలు గాలికొదిలేసి..

మరిన్ని వార్తలు