టీకా ‘వంద’నాలు

22 Oct, 2021 08:15 IST|Sakshi

మువ్వన్నెల వెలుగులతో దేశమంతటా పండుగ వాతావరణం  

న్యూఢిల్లీ: కరోనా కొమ్ములు వంచడానికి చేస్తున్న పోరాటంలో మన దేశం మరో మైలురాయిని అధిగమించింది. తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ డోసుల్ని పంపిణీ చేసి ఘన కీర్తి సాధించింది. కరోనాపై పోరాటంలో రక్షణ కవచమైన భారీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఈ ఏడాది జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తొలుత ఆరోగ్య, వైద్య సిబ్బందికి టీకా డోసులు ఇచ్చిన కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విడతల వారీగా, పక్కా ప్రణాళికతో ఒక్కో వయసు వారికి ఇస్తూ ముందుకు వెళ్లింది. అక్టోబర్‌ 21 నాటికి వంద టీకా డోసుల్ని పూర్తి చేసి చైనా తర్వాత శతకోటి డోసుల్ని పంపిణీ చేసిన రెండో దేశంగా ప్రపంచ దేశాల ప్రశంసల్ని అందుకుంది. ఈ అపురూపమైన ఘట్టానికి గుర్తుగా దేశమంతటా మువ్వన్నెల వెలుగులు ప్రసరించాయి.  

దివ్యాంగురాలితో ముచ్చటించిన మోదీ

వ్యాక్సినేషన్‌ కేంద్రానికి వీల్‌చైర్‌లో వచ్చిన అరుణ రాయ్‌ అనే దివ్యాంగురాలితో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆ అమ్మాయి హాబీలేమిటో అడిగి తెలుసుకున్నారు. అరుణ పాటలు పాడుతుందని తెలుసుకొని ఆమె చేత పాడించుకొని విన్నారు. అరుణ, ఆమె తల్లి కోరిక మేరకు వారితో కలిసి ఫోటోలు దిగారు.  

ప్రత్యేక గీతం విడుదల
వంద కోట్ల డోసుల పంపిణీని విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఒక ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. గాయకుడు కైలాష్‌ ఖేర్‌ ఆలపించిన ఈ గీతం ఆడియో విజువల్‌ ఫిల్మ్‌ని ఎర్రకోట వద్ద విడుదల చేశారు. దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో 100 కోట్లు డోసులు పూర్తయినట్టుగా ప్రకటనలు ఇచ్చారు. ఫ్రంట్‌లైన్‌ సిబ్బందిని అభినందిస్తూ అనౌన్స్‌మెంట్లు ఇచ్చారు. కొన్ని మొబైల్‌ సంస్థలు 100 కోట్ల డోసులు పూర్తయినట్టుగా కాలర్‌ ట్యూన్లు ఉంచాయి.  

మువ్వన్నెల వెలుగులు
శత కోటి టీకా డోసులు అరుదైన చరిత్రను సాధించినందుకుగాను ఢిల్లీలోని కుతుబ్‌మినార్‌ నుంచి హైదరాబాద్‌లోని గోల్కొండ కోట వరకు 100 వారసత్వ కట్టడాలను త్రివర్ణ శోభతో కాంతులు ప్రసరించేలా పురావస్తు శాఖ చర్యలు తీసుకుంది.  ఎర్రకోట, కుతుబ్‌ మినార్, హుమయూన్‌ టూంబ్, హంపి, ఖజురహోలతో పాటుగా హైదరాబాద్‌లోని గోల్కొండ కోట, వరంగల్‌ రామప్ప ఆలయం వంటివి ఉన్నాయి. ఇక 1,400 కేజీల బరువైన ఖాదీ జాతీయ పతాకాన్ని ఎర్రకోట వద్ద ఆవిష్కరించారు.

అభినందించిన డబ్ల్యూహెచ్‌ఓ: వంద కోట్ల మైలురాయి పూర్తయిన సందర్భంగా ప్రపంచ దేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రియాసస్‌ ప్రధాని మోదీని, శాస్త్రవేత్తల్ని, ఆరోగ్య సిబ్బంది, భారత ప్రజల్ని అభినందించారు. కోవిడ్‌ నుంచి రక్షణ కోసం భారత్‌  చేస్తున్న కృషి, టీకా డోసుల సమాన పంపిణీకి తీసుకుంటున్న చర్యల్ని ఆయన కొనియాడారు. బలమైన రాజకీయ నాయకత్వం, ఆరోగ్య, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లలో చిత్తశుద్ధి లేకుండా ఇలాంటి ఫీట్‌ సాధించడం అసాధ్యమని డబ్ల్యూహెచ్‌ఓ రీజనల్‌ డైరెక్టర్, ఆగ్నేయాసియా డాక్టర్‌ పూనమ్‌ ఖేత్రపాల్‌ సింగ్‌ అన్నారు.

భారత్‌ చరిత్ర లిఖించింది: ప్రధాని  
వంద కోట్ల మార్క్‌ని దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని రామ్‌ మనోహర్‌ లోహియా ఆస్పత్రిలో వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని  సందర్శించారు. వైద్య , ఆరోగ్య సిబ్బందితో ప్రధాని మాట్లాడి వారిని అభినందించారు. లబ్ధిదారులతో కలిసి ముచ్చటించారు. ప్రధాని వెంట కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. అంతకు ముందు ట్విట్టర్‌ వేదికగా ప్రధాని స్పందించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భారత్‌ చరిత్ర సృష్టించిందని వ్యాఖ్యానించారు. ‘‘భారత్‌ చరిత్ర లిఖించింది. భారత శాస్త్ర, పారిశ్రామిక రంగాలతో పాటు 130 కోట్ల మంది భారతీయుల సమష్టి స్ఫూర్తికి ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మహోన్నత యజ్ఞంలో పాలుపంచుకున్న మన వైద్యులు, నర్సులు ఇతర సిబ్బందికి పేరు పేరునా కృతజ్ఞతలు.

వంద కోట్ల డోసులు మనకి గర్వకారణం, రక్షణ కవచం’’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఢిల్లీ ఎయిమ్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించిన మోదీ వందేళ్లకు ఒకసారి వచ్చే మహమ్మారిని తరిమికొట్టే పటిష్టమైన రక్షణకవచం 100 కోట్ల డోసుల ద్వారా వచ్చిందని అన్నారు. ఈ ఘనత దేశంలోని ప్రతీ ఒక్కరికీ చెందుతుందని చెప్పారు. కరోనాపై పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న నీతి అయోగ్‌ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్‌ ప్యానెల్‌ చీఫ్‌ వీకే పాల్‌ కేవలం తొమ్మిది నెలల్లోనే వంద కోట్ల డోసుల్ని ఇవ్వడం అరుదైన విషయమన్నారు. ఇంకా వయోజనుల్లో 25 శాతం మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని ఈ ఏడాది చివరి నాటికి అందరికీ సింగిల్‌ డోసు ఇవ్వడం లక్ష్యమని చెప్పారు. 


(చదవండి: Covid-19: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు)


(చదవండి: "అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు)

చదవండి: కోవిడ్‌ జరిమానాలు కట్టిన వారు 40.33 లక్షలు 

మరిన్ని వార్తలు