‘రెండో డోసు తర్వాత మరణాల శాతం మరింత తగ్గింది’

9 Sep, 2021 20:24 IST|Sakshi

న్యూఢిల్లీ:  దేశంలో కరోనా వైరస్‌ కట్టడిలో టీకాలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు కేంద్రం ఒక నివేదికలో వెల్లడించింది. మొదటి డోసు అనంతరం 96 శాతం మరణాలు తగ్గగా,  రెండో డోసు తర్వాత  97 శాతం మరణాలు తగ్గాయని పేర్కొంది.  కాగా, గత ఏప్రిల్‌ -మే నెలలో విజృభించిన కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో మరణించిన వారిలో అత్యధిక శాతం మంది టీకాలు వేయించుకోని వాళ్లేనని  కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 43 వేల మంది కొత్త కరోనా వైరస్‌ ఇన్ఫక్షన్‌ల బారినపడ్డారని, దాదాపు 338 మంది చనిపోయినట్లు నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా 4 లక్షల మంది చనిపోయినట్లు పేర్కొంది.(చదవండి: టీకాలు ఎగిరొస్తాయ్‌!)

ఈ సందర్భంగా కోవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ అధికారి వీకే పాల్‌ మాట్లాడుతూ...."వైరస్‌తో పోరాడటానికి వ్యాక్సిన్‌ మనకు రక్షణ కవచంలా పనిచేస్తోంది. వ్యాక్సిన్‌లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, మొదటి డోస్‌ తీసకుంటేనే సెకండ్‌ డోస్‌ తీసుకునే అవకాశం ఉంటుంది. వ్యాక్సిన్‌ తీసుకుంటే ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం చాలా తక్కువ’ అని తెలిపారు. అదే సమయంలో కోవిడ్‌తో పాటు డెంగ్యూలాంటి ప్రాణాంతక వ్యాధులు ఎక్కువవుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్‌లో చాలా మంది పిల్లలు డెంగ్యూ జ్వరంతోనే చనిపోయినట్లు వెల్లడించారు. (చదవండి: వ్యాక్సిన్‌ డెలివరీలో సంచలనం! దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..)
 

మరిన్ని వార్తలు