ట్రయల్స్‌ లేకుండా టీకాలా?: ఢిల్లీ హైకోర్టు

17 Jul, 2021 04:41 IST|Sakshi

పిల్లలకు ఇవ్వడం మరింత ప్రమాదకరం

క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించకుండా కరోనా టీకాలనివ్వడం, అదికూడా పిల్లలకు ఇవ్వడం ఉత్పాతాన్ని కలిగిస్తుందని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రయల్స్‌ను సత్వరం పూర్తి చేసి 18ఏళ్లలోపు వారికి కూడా తొందరగా టీకానిచ్చే చర్యలు వేగవంతం చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచిఉన్నందున పిల్లలకు వెంటనే టీకాలిచ్చేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న పిల్‌పై కోర్టు విచారణ జరిపింది. కెనడా, యూఎస్‌లాంటి దేశాల్లో పిల్లలకు టీకాలిస్తున్నారని, భారత్‌లో ఈ విషయమై ఒక విధానం రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని పిటిషనర్‌ ఆరోపించారు.

అయితే జైడస్‌ కాడిలా చిన్నపిల్లల కోసం డీఎన్‌ఏ టీకాపై ట్రయల్స్‌ జరుపుతోందని, త్వరలో ఇది అందుబాటులోకి రావచ్చని ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌శర్మ కోర్టుకు తెలిపారు. వీలయినంత తొందరగా దేశంలో 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయడమే ప్రభుత్వ ప్రాధాన్యమన్నారు. 18 ఏళ్లలోపు వారికి టీకాపై ట్రయల్స్‌ జరుగుతున్నాయని, ఇవి పూర్తికాగానే పిల్లల టీకాలపై విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రం తెలిపింది. ట్రయల్స్‌ను సంపూర్ణంగా ముగించాలని, లేదంటే ఉత్పాతాలు జరుగుతాయని కోర్టు అభిప్రాయపడింది. పిల్లలకు టీకా కోసం దేశమంతా ఆత్రుతగా ఎదురుచూస్తోందని, ఈ విషయమై చర్యలు తీసుకోవాలని సూచించింది. 10, 12 తరగతుల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సినందున వీరికి టీకాలివ్వాలన్న మరో పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.  

>
మరిన్ని వార్తలు