పిల్లలకి వ్యాక్సిన్‌ ఇది సమయమేనా ?

14 Oct, 2021 04:42 IST|Sakshi

రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు వారికి భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ వెయ్యొచ్చని నిపుణుల కమిటీ సిఫారసు చేయడంతో తల్లిదండ్రుల్లో ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలకు ఇచి్చన వ్యాక్సినే పిల్లలకీ ఇస్తారా ? సైడ్‌ ఎఫెక్ట్‌లు ఎలా ఉంటాయి? ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ వ్యాక్సిన్‌ వేయాల్సిన అవసరం ఉందా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మరోసారి పిల్లలకి కోవిడ్‌ వ్యాక్సిన్‌పై చర్చ తెరపైకి వచ్చింది.  

పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ తయారు చేస్తారా?  
పిల్లలకి ప్రత్యేకంగా వ్యాక్సిన్‌ ఏమీ ఉండదు. అయితే డోసుని తగ్గించి ఇస్తారు. పెద్దలకు ఇచ్చే వ్యాక్సిన్‌ డోసులో సగం మాత్రమే పిల్లలకి ఇస్తారు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ పెద్దలకి ఒక్క మిల్లీ లీటర్‌ డోసు రెండు విడతలుగా 28 రోజుల వ్యవధిలో ఇస్తున్నారు. పిల్లలకి అందులో సగం అంటే 0.5 ఎంల్‌ డోసుని రెండు విడతలుగా ఇస్తారు. ఒక్కో డోసు 0.25 ఎంఎల్‌ ఉంటుంది.  

సైడ్‌ ఎఫెక్ట్‌లు ఉంటాయా?
చిన్నపిల్లలకి ఏ వ్యాక్సిన్‌ ఇచ్చినా కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, వ్యాక్సిన్‌ ఇచ్చిన చోట నొప్పి మాత్రమే ఉంటాయి.  

ఏయే వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి?
మన దేశంలో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి జైడస్‌ క్యాడిల్లా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చారు. డీఎన్‌ఏ ఆధారిత ఈ వ్యాక్సిన్‌ ఇంకా అందుబాటులోకి రాలేదు. పిల్లలకు అనుమతులు మంజూరైన తొలి వ్యాక్సిన్‌ ఇదే. అమెరికాకు చెందిన నొవావాక్స్‌ (భారత్‌లో దీనిని కొవావాక్స్‌ అని పిలుస్తున్నారు) వ్యాక్సిన్‌ను 2–17 ఏళ్ల వయసు వారికి ఇవ్వడానికి క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయి. పుణెకి చెందిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ రెండు, మూడో దశ ప్రయోగాల్లో ఉంది. ఇక హైదరాబాద్‌కు చెందిన బయోలాజిక్‌ ఈ లిమిటెడ్‌ కార్బోవ్యాక్స్‌ వ్యాక్సిన్‌ 5 నుంచి 18 ఏళ్ల వయసు వారి కోసం ప్రయోగాలు నిర్వహించడానికి డీసీజీఐ అనుమతులిచ్చింది.  

ఇది సరైన సమయమేనా?  
కరోనా పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించకపోవడం, దేశవ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టిన ఈ సమయంలో వారికి వ్యాక్సిన్‌ వెయ్యడానికి ఇది సరైన సమయమేనా అన్న సందేహం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది. అయితే వైద్య నిపుణులు మాత్రం పిల్లలకి కూడా వ్యాక్సిన్‌ వెయ్యాల్సిన అవసరం ఉందని అంటున్నారు. దేశ జనాభాలో పిల్లలు 25–30% వరకు ఉంటారు. వీరికి వ్యాక్సిన్‌ వెయ్యకపోతే, వ్యక్తిగతంగా వారికి నష్టం జరగకపోయినా వారు సూపర్‌ స్ప్రెడర్లుగా మారే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇప్పుడిప్పుడే పలు రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభించారు. దసరా తర్వాత కొన్ని రాష్ట్రాలు స్కూళ్లని తెరవడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు స్కూలుకు వెళ్లే పిల్లలకి వ్యాక్సిన్‌ వెయ్యకపోతే రెండో వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌ మూడో వేవ్‌ బారిన పడే ప్రమాదం ఉంది.    

ఇతర దేశాల్లో పిల్లలకి వ్యాక్సిన్‌ ఎలా?  
అమెరికా, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో 12 ఏళ్ల వయసు పైబడిన వారికి ఫైజర్‌–బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఇస్తున్నారు. ఇక రెండేళ్ల పిల్లలకి వ్యాక్సిన్‌ ఇస్తున్న మొట్టమొదటి దేశం క్యూబా. సెపె్టంబర్‌ 13 నుంచి ఆ దేశం చిన్నపిల్లలకి వ్యాక్సిన్‌ ఇవ్వడం మొదలు పెట్టింది. చైనా, యూఏఈ, వెనెజులా దేశాలు రెండేళ్ల వయసు వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి సన్నాహాలు ప్రారంభించాయి.

నిపుణుల అభిప్రాయాలు
మొదటి వేవ్‌లో మొత్తం కేసుల్లో 4% పిల్లలకే సోకింది. రెండో వేవ్‌ వచ్చేసరికి 10–15% పిల్లల్లో కేసులు పెరిగాయి. పాఠశాలలు కూడా పునఃప్రారంభం కావస్తూ ఉండడంతో పిల్లలకి వ్యాక్సిన్‌ ఇవ్వడానికి ఇదే సమయం. చిన్నారులకి వ్యాక్సిన్‌ దేశంలో ఒక గేమ్‌ ఛేంజర్‌గా మారనుంది        
– డాక్టర్‌ సుజీర్‌ రంజన్, అసోసియేట్‌ డైరెక్టర్, టాటా ట్రస్ట్స్‌

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కి డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి లభించలేదు. చాలా దేశాలు కోవాగ్జిన్‌ను గుర్తించడం లేదు. దీనికి కారణం పూర్తి స్థాయి డేటా లేకపోవడమే. అందుకే మరింత డేటా వచ్చేవరకు వేచి చూసి పిల్లలకు వేస్తే మంచిది.         
– డాక్టర్‌ శ్రీకాంత్, పీడియాట్రిషన్, బెంగళూరు

– నేషనల్‌ డెస్క్‌, సాక్షి  

మరిన్ని వార్తలు