Corona Vaccine: టీకా వేసుకున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి!

2 Jun, 2021 04:12 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ: కోవిడ్‌ నుంచి కోలుకున్న బాధితులకు కోవిడ్‌ టీకాలు ఇస్తే అవి వారిలో సహజసిద్ధ వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరగడానికి దోహదపడతాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. టీకాలు తీసుకున్న వారు భవిష్యత్‌లో దాడిచేసే ఇతర వేరియంట్లను సైతం సమర్థవంతంగా ఎదుర్కోగలరని అధ్యయనం పేర్కొంది. గత ఏడాది కరోనా బారినపడి తర్వాత కోలుకున్న బాధితుల రక్త నమూనాల్లో యాంటీబాడీలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని కొనుగొన్నట్లు అమెరికాలోని రాకీఫెల్లర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.

వ్యాధినిరోధక శక్తి మరింతగా పెరిగాక సార్స్‌– కోవ్‌–2 వైరస్‌లను ఇమ్యూనిటీకి సంబంధించిన మెమొరీ బి–సెల్స్‌ సమర్థవంతంగా ఎదుర్కొన్నాయని పరిశోధకులు చెప్పారు. మానవ శరీరంపై దాడి చేసే వేర్వేరు రకాల వైరస్‌లను అంతమొందించేందుకు మన వ్యాధినిరోధక వ్యవస్థ తయారుచేసే వేర్వేరు రకాల యాంటీబాడీల నిధే మెమొరీ బి–సెల్స్‌. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ తర్వాత కోవిడ్‌ రికవరీ వ్యక్తుల్లో మరింత శక్తివంతమైన, ఎక్కువకాలం నిలిచే రక్షణవ్యవస్థ అభివృద్ధి చెందిందని చెప్పారు. కనీసం ఒక డోస్‌ మోడెర్నా / ఫైజర్‌ టీకా తీసుకున్న వారిలో యాంటీబాడీలు గణనీయంగా పెరిగాయన్నారు.

అమెరికాలోని న్యూయార్క్‌లో, బ్రిటన్‌లో, దక్షిణాఫ్రి కాలలో తొలిసారిగా కనుగొన్న వేర్వేరు వేరియంట్లనూ నాశనంచేసే యాంటీబాడీలు వీరిలో అభివృద్ధి చెందాయి. మెమొరీ బి–సెల్స్‌ వల్లే ఈ యాంటీబాడీల ఉత్పత్తిసాధ్యమైందని పరిశోధకులు చెప్పారు. ఇంతవరకు కరోనా బారినపడని వ్యక్తులకూ ప్రస్తుత డోస్‌లతోపాటు బూస్టర్‌ డోస్‌ ఇస్తే వారికి మరింత రక్షణ లభిస్తుందని అధ్యయనం సూచించింది. అయితే, ఈ అధ్యయనం ఫలితాల ఖచ్చితత్వాన్ని ఇదే రంగంలోని వేరే సంస్థలకు చెందిన నిపుణులు ఇంకా పరిశీలించాల్సి ఉంది.

>
మరిన్ని వార్తలు