తమిళనాట బీజేపీ పాలి‘ట్రిక్స్‌’.. పన్నీరు సెల్వానికి ఊహించని షాక్‌!

6 Dec, 2022 07:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: ఎన్డీఏ కూటమితో కలిసే లోక్‌సభ ఎన్నికలను  అన్నాడీఎంకే ఎదుర్కొంటుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదని మాజీ మంత్రి, ఆపార్టీ సీనియర్‌ నేత వైద్యలింగం స్పష్టం చేశారు. ఇది కాస్త పన్నీరు శిబిరాన్ని ఇరకాటంలో పడేసినట్లయ్యింది. వివరాల ప్రకారం.. అన్నాడీఎంకేలో పన్నీరు, పళణి వర్గాలు వేర్వేరు గ్రూపులుగా పయనిస్తున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలు తమ నేతృత్వంలోనే సాగుతాయని, తామిచ్చిన సీట్లతో మిత్రులు సర్దుకోవాల్సి ఉంటుందనేలా ఇప్పటికే బీజేపీ నాయకులు వ్యాఖ్య లు చేస్తున్న విషయం తెలిసిందే.

దీనిని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామి తిప్పికొట్టారు. అన్నాడీఎంకే నేతృత్వంలోనే రాష్ట్రంలో కూటమి అని, ఎవరైనా తమ గొడుగు నీడన మాత్ర మే ముందుకు సాగాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, పన్నీరు సెల్వం మాత్రం ఈ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేంద్రం మద్దతు తనకు అవశ్యం కావడంతో ఆయన కూటమి విషయంపై ఇప్పటి వరకు స్పందించ లేదు. అయితే, ఆయన శిబిరంలో సీనియర్‌గా ఉన్న వైద్యలింగం సోమవారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయంశంగామారింది. ఇది కాస్త పళణిస్వామి శిబిరానికి అను కూలంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

కూటమిపై స్పష్టత.. 
పుదుకోట్టైలో వైద్యలింగం మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే సమన్వయ కమిటీ నేత పన్నీరు సెల్వం శిబిరానికి ఆపార్టీ చిహ్నం రెండాకులు చిక్కడం ఖాయమని అన్నారు. లోక్‌సభ ఎన్నికలను ఎన్డీఏ కూటమితోనే కలిసి ఎదుర్కొంటామని, ఆ కూటమిలోనే అన్నాడీఎంకే ఉంటుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి మార్పులేదన్నారు. ఎన్డీఏలో అన్నాడీఎంకే భాగస్వామ్యం ఉందని, అధిక సీట్లలో తమ అభ్యర్థులే రాష్ట్రంలో పోటీ చేస్తారని తెలిపారు. అయితే, ఈ వ్యాఖ్యలను అస్త్రంగా చేసుకుని పన్నీరుకు వ్యతిరేకంగా పళణి శిబిరం వ్యూహాలకు పదునుపెట్టింది. అన్నాడీఎంకేను తాకట్టు పెట్టేందుకు పన్నీరు సిద్ధమయ్యారని విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు.   

మరిన్ని వార్తలు