ఫ్యాషన్‌ డిజైన్‌లో అద్భుతాలు.. తొలి భారతీయురాలిగా రికార్డ్‌! 

19 Jul, 2022 10:42 IST|Sakshi

భోపాల్‌: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని చేసి చూపించారు ఓ యువతి. రోజుకు రూ.250 సంపాదించేందుకు ఇబ్బందులు పడిన స్థాయి నుంచి దేశం గర్వించే స్థితికి చేరుకున్నారు. తాను ఎంచుకున్న వృత్తినే నమ్ముకుని తన ప్రతిభతో.. విదిశా నుంచి విదేశాలకు భారత కళను తీసుకెళ్లారు. ఆమెనే మధ్యప్రదేశ్‍లోని విదిశా నగరానికి చెందిన వైశాలి షడంగులే. వైశాలి ఎస్‌ లేబుల్‌తో ఫ్యాషన్‌ డిజైనర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. పారిస్‌ హాట్ కోచర్‌ వీక్‌లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారు తన విజయంతో భారతీయ వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు.

కేంద్ర జౌళి శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌.. వైశాలి స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని తన ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. విదిశా టూ విదేశ్ అంటూ వైశాలిపై ప్రశంసలు కురింపించారు మంత్రి. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన పారిస్‌ హాట్‌ కోచర్‌ ఫ్యాషన్‌ వీక్‌లో తన డిజైన్లను ప్రదర్శించిన తొలి భారతీయురాలిగా నిలిచారని కొనియాడారు.

17 ఏళ్ల వయసులో ఇంటి నుంచి బయటకు.. 
17 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి బయటకు వచ్చిన వైశాలి.. హాస్టల్‌లో ఉంటూ పలు ఉద్యోగాలు చేశారు. ఈ క్రమంలో వస్త్రధారణ ఎలా ఉండాలి, స్టైల్‌ లుక్‌ కోసం తన స్నేహితులు, తెలిసినవారికి సూచనలు ఇచ్చేవారు. దీంతో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేయాలని కొందరు సూచించారు. కానీ, ఆ పదమే ఆమెకు కొత్త. తన స్నేహితుడి సాయంతో ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. 2001లో సొంత లేబుల్‌తో మలాద్‌లో చిన్న బొటిక్‌ తెరిచారు వైశాలి. భారత వస్త్రాలతో ఆధునిక హంగులు జోడించి కొత్త కొత్త డిజైన్లు చేయటంపై దృష్టి సారించారు. విభిన్నమైన వస్త్రాలతో వినియోగదారులను ఆకట్టుకున్న వైశాలి.. మరో రెండు స్టోర్సు తెరిచారు. ఆ తర్వాత తన లేబుల్‌ను వివిధ ఫ్యాషన్‌ వీక్‌లలో ప్రదర్శించటం ప్రారంభించారు. 

అదే నా కల.. 
2021, జులైలో జరిగిన పారిస్‌ హాట్‌ కోచర్‌ ఫ్యాషన్‌ వీక్‌లో తన డిజైన్లను తొలిసారి ప్రదర్శించారు వైశాలి. దాంతో భారత వస్త్రాలను ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లారు.‘భారత వస్త్రాలను, డిజైన్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనేదే నా కల. ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇంటర్నేషనల్‌ డిజైనర్లను చూస్తాము. వారు మన నైపుణ్యాన్ని, డిజైన్లను ఉపయోగిస్తారు. ఆ డిజైన్లనే మనమెందుకు చేయలేమని ఆలోచిస్తుంటాను.’ అని పేర్కొన్నారు వైశాలి. సోనమ్‌ కపూర్‌, కల్కీ కోచ్లిన్‌ సహా పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలు వైశాలి వద్దకు వస్తుంటారు.

ఇదీ చదవండి: ఫైటర్‌ జెట్‌లో ‘బోరిస్‌’ సెల్ఫీ వీడియో.. నెటిజన్ల పైర్‌!

మరిన్ని వార్తలు