రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఆ రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రద్దు, కారణం అదే!

16 May, 2023 17:22 IST|Sakshi

న్యూఢిల్లీ: మోదీ సర్కార్‌ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ రైళ్ల సేవలు కేవలం కొన్ని నగరాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ దేశంలో అత్యంత వేగవంతమైన రైలుగా పేరు సంపాదించుకోవడంతో పాటు ప్యాసింజర్లకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తోంది. అయితే కొన్ని రూట్లలో మాత్రం ఊహించినంత ఆదరణ వీటికి లభించనట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా తాజాగా ఓ రూట్‌లో వందేభారత్ రైలుని నిలిపివేసింది రైల్వే శాఖ.

మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఛత్తీస్‌గఢ్ బిలాస్‌పూర్ వరకు ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆటంకం ఏర్పడింది. సరైన అక్యుపెన్సీ లేని కారణంగా ఈ రైలును ఇండియన్ రైల్వేస్‌ రద్దు చేసింది. రైల్వే శాఖ ఆశించినమేర ప్యాసింజర్లు వందే భారత్‌లో ప్రయాణించేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో ఈ రూట్‌లో వందే భారత్‌ ఎక్స్‌​ప్రెస్‌ స్థానంలో తేజస్ ఎక్స్‌ప్రెస్ నడపనున్నట్లు ప్రకటించింది. 

బిలాస్‌పూర్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను గత ఏడాది డిసెంబర్‌లో నాగ్‌పూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాగ్‌పూర్ నుంచి బిలాస్‌పూర్‌కు ప్రయాణ సమయాన్ని ఏడు-ఎనిమిది గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, అధిక ధరల కారణంగా, ఆక్యుపెన్సీ సంతృప్తికరంగా లేదని అధికారులు చెబుతున్నారు. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు మొట్టమొదటి కార్పొరేట్ రైలుగా 2017లో ప్రారంభించారు. ఇది పూర్తిగా భారతీయ రైల్వేల అనుబంధ సంస్థ అయిన ఐఆర్‌సీటీసీ ద్వారా నిర్వహిస్తున్నారు. దీనిని తొలిసారిగా 2017లో అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ఉంబై నుంచి గోవా మార్గంలో ప్రారంభించారు. 
 

మరిన్ని వార్తలు