జ్ఞానవాపి మసీదు: ‘దర్శనానికి అనుమతిస్తారా?..’ కీలక తీర్పుపై ఉత్కంఠ

12 Sep, 2022 08:20 IST|Sakshi

వారణాసి: ఉత్తర ప్రదేశ్‌లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్‌లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్‌పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 

కీలక తీర్పు నేపథ్యంలో పోలీసులు వారణాసిలో 144 సెక్షన్‌ విధించి.. హైఅలర్ట్‌ ప్రకటించారు. సోమవారం కావడంతో.. కాశీ విశ్వనాథ్‌ ఆలయం వద్ద భద్రతను భారీగా పెంచారు. ఈ పిటిషన్‌-అభ్యంతరాలపై ఇప్పటికే వాదనలు విన్న జిల్లా న్యాయమూర్తి అజయ్‌ కృష్ణ.. ఆగష్టు 24వ తేదీనే తీర్పును సిద్ధం చేసి వాయిదా వేశారు. అయితే.. ఇవాళ ఆ తీర్పును ప్రకటించనున్నారు. 

మసీదు కాంప్లెక్స్‌లోని తటాకంలో శివలింగాకారం బయటపడిందని, హిందూ నేపథ్యం ఉన్న కారణంగా అక్కడ పూజలకు అనుమతించాలంటూ ఐదుగురు మహిళలు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో... కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక కమిటీ అక్కడ వీడియో సర్వే నిర్వహించింది కూడా. అయితే.. అది శివలింగం కాదంటూ మసీద్‌ కమిటీ వాదిస్తోంది.  

ఆపై సుప్రీం కోర్టుకు చేరిన ఈ వ్యవహారం.. తిరిగి వారణాసి కోర్టుకే చేరింది. కమిటీ రిపోర్ట్‌ సీల్డ్‌ కవర్‌లో వారణాసి కోర్టుకు చేరగా.. అదీ, వీడియో రికార్డింగ్‌కు సంబంధించిన ఫుటేజీలు బయటకు రావడంతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ తీర్పు గనుక వ్యతిరేకంగా వస్తే అలహాబాద్‌ హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్తామని పిటిషనర్లు చెప్తున్నారు.

ఇదీ చదవండి: ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద శివైక్యం

మరిన్ని వార్తలు