Gyanvapi Mosque Survey: జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక లీక్‌! కలకలం రేపుతున్న ప్రచారం

19 May, 2022 21:15 IST|Sakshi

లక్నో: దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చేస్తున్న జ్ఞానవాపి మసీదు సర్వే నివేదిక.. వారణాసి కోర్టుకి చేరింది. ఒకవైపు ఈ వ్యవహారంలో తమ దగ్గర వాదనలు పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలకు ఉపక్రమించొద్దంటూ సుప్రీం కోర్టు గురువారం వారణాసి కోర్టును ఆదేశించింది. అయినప్పటికీ ముందుగా విధించిన గడువు కావడంతో.. సర్వే చేపట్టిన అడ్వొకేట్‌ కమిటీ ఇవాళే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. 

ఇదిలా ఉంటే.. గురువారం అడ్వొకేట్‌ కమిషన్‌ జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో చేపట్టిన సర్వే నివేదికను వారణాసి కోర్టులో సమర్పించింది. అయితే సీల్డ్‌ కవర్‌లో కోర్టుకు సమర్పించిన నివేదిక కాపీ సమాచారం.. బయటకు పొక్కిందనే ప్రచారం కలకలం రేపుతోంది. కోర్టుకు సమర్పించిన గంటల వ్యవధిలోనే పిటిషనర్ల(ఐదుగురు హిందూ మహిళలు) తరపు న్యాయవాదుల చేతుల్లోకి కాపీ వెళ్లిందని, అక్కడి నుంచి లీకుల పర్వం మొదలైందని ప్రచారం నడుస్తోంది. ఈ మేరకు పలు జాతీయ మీడియా చానెల్స్‌లో కథనాలు వస్తుండడం గమనార్హం.  

బహిర్గతం అయిన ఆ నివేదికలో.. హిందూ విగ్రహాలు,  చిహ్నాలు ఉన్నాయని... పిటిషనర్లు వాళ్ల వాదనలను సమర్థిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. సర్వే పూర్తయ్యే తరుణంలోనే.. శివలింగం బయటపడిందంటూ కొన్ని ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై సీరియస్‌ అయిన కోర్టు.. అడ్వొకేట్‌ కమిషనర్‌ అయిన అజయ్‌ మిశ్రాను తప్పించింది. బయటకు పొక్కిన నివేదిక వివరాలు..

  • మసీదు పిల్లర్ల బేస్‌మెంట్‌లో.. కలశం, పువ్వుల నగిషీలు, ప్రాచీన హిందీ భాషలో చెక్కిన అక్షరాలు   
  • బేస్‌మెంట్‌ గోడలో త్రిశూల ఆకారం
  • మసీదు పశ్చిమం వైపు గోడ మీద కమాను, రెండు పెద్ద పిల్లర్లు ఆలయానికి సంబంధించిన గుర్తులేనని పిటిషనర్ల వాదన. 
  • మసీదు మధ్య డోమ్‌ కింద.. శంఖాకార నిర్మాణం
  • మూడో డోమ్‌ కింద.. తామర పువ్వులను పోలిన నగిషీలు
  • మసీదు వాజుఖానాలో బయటపడ్డ రెండున్నర అడుగుల ఎత్తున్న ఆకారం(శివలింగం) అని పిటిషనర్లు.. కాదు ఫౌంటెన్‌ నిర్మాణమని మసీదు నిర్వాహకుల వాదన.


మసీదు ప్రాంగణాన్ని ఆనుకుని ఉన్న గోడ

కోర్టుకు మాత్రమే పరిమితం కావాల్సిన నివేదిక.. సున్నితమైన అంశానికి సంబంధించిన చాలా గోప్యమైన నివేదిక బయటకు పొక్కడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. లీక్‌ అయిన ఈ నివేదికపై మసీదు కమిటీ కూడా ఇప్పటిదాకా స్పందించలేదు. ఒకవేళ ప్రచారంలో ఉన్న నివేదికే నిజమైతే మాత్రం.. కోర్టు ఈ విషయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి. 

► వారణాసి కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉన్న.. జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్‌లో మూడు రోజులపాటు.. భారీ భద్రత నడుమ అడ్వొకేట్‌ కమిటీ సమక్షంలో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. 14 నుంచి 16వ తేదీల మధ్య ఈ సర్వే పూర్తైంది. ఈ సర్వే సమయంలోనే అడ్వొకేట్‌ కమిషనర్‌ అజయ్‌ మిశ్రా లీకుల ద్వారా మసీదు వజుఖానాలో ‘శివలింగం’ బయటపడిందనే కథనాలు బయటకు వచ్చాయి. దీంతో శివలింగాన్ని సంరక్షిస్తూనే.. నమాజ్‌లకు ఆటంకాలకు కలిగించవద్దంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు ఉద్రిక్తలు చోటు చేసుకోకుండా ఆ ప్రాంతంలో భద్రతను ఏర్పాటు చేశారు. 

► మరోవైపు సర్వే పూర్తి నివేదికను అడ్వొకేట్‌ కమిషనర్‌ విశాల్‌ సింగ్‌(లీక్‌ నేపథ్యంలో అజయ్‌ మిశ్రాను తొలగించి..) ఆధ్వర్యంలో వారణాసికి కోర్టుకు సమర్పించారు. మూడు సీల్డ్‌ బాక్సుల్లో, వందలాది ఫొటోలు, వీడియోలతో కూడిన ఒక చిప్‌ను సమర్పించారు. ఈ లోపే లీక్‌ కథనాలు కలకలం సృష్టిస్తున్నాయి. సుప్రీం కోర్టులో దాఖలైన వీడియోగ్రఫీ సర్వే అభ్యంతర పిటిషన్‌పై శుక్రవారం వాదనలు జరగనున్నాయి. అటుపై పరిస్థితిని బట్టి.. సోమవారం ఈ కేసులో తదుపరి వాదనలు వారణాసి కోర్టులో జరగనున్నాయి. 

చదవండి: మసీదులు అంతకుముందు ఆలయాలే! తాఖీర్ రజా వ్యాఖ్యల దుమారం

మరిన్ని వార్తలు