మొరాయించిన ‘వందే భారత్‌’ ట్రైన్‌.. వరుసగా మూడో రోజూ సమస్య..!

8 Oct, 2022 18:26 IST|Sakshi
ఖుర్జా రైల్వే స్టేషన్‌లో నిలిచిపోయిన వందే భారత్‌ రైలు

లక్నో: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన సెమీ హైస్పీడ్ ‘వందే భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు వరుస ప్రమాదాలకు గురవుతున్నాయి. గత రెండు రోజుల్లో ముంబయి-గాంధీనగర్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుసార్లు పశువులను ఢీకొని ఆగిపోయింది. తాజాగా మరో వందే భారత్‌ రైలులో సాంకేతిక సమస్య ఏర్పడి మొరాయించింది. శనివారం న్యూఢిల్లీ నుంచి వారణాసి బయల్దేరిన ఎక్స్‌ప్రెస్‌ రైలులో ట్రాక్షన్‌ మోటార్‌ జామ్‌ అయి మధ్యలోనే ఆగిపోయింది.

‘వారణాసి వందే భారత్‌(ట్రైన్‌ నంబర్‌ 22436) కోచ్‌ సీ8లోని ట్రాక్షన్‌ మోటార్‌ వీల్‌ బేరింగ్‌ విఫలమైంది. దీంతో ధన్‌కౌర్‌, వెయిర్‌ స్టేషన్ల మధ్య నిలిచిపోయింది. ఈ లోపాన్ని గుర్తించి వెంటనే రైల్వే ఆపరేషన్స్‌ కంట్రోల్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు క్షేత్రస్థాయి అధికారులు. దీంతో రైల్లోనే ఉన్నసాంకేతిక సిబ్బంది తనిఖీ చేసి.. ఎక్స్‌ప్రెస్‌ రైలును నియంత్రిత వేగంతో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖుర్జా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ 5 గంటల పాటు మరమ్మతులు చేసినా ఫలితం లభించలేదు. దీంతో అందులోని ప్రయాణికులను శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో గమ్యస్థానానికి చేర్చాం. సమస్య తలెత్తిన బోగీని నిర్వహణ డిపోకి తీసుకెళ్లి తనిఖీ చేసిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయి. ’ అని రైల్వే శాఖ వెల్లడించింది.


వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నుంచి శతాబ్ది ట్రైన్‌లోకి మారుతున్న ప్రయాణికులు

మరోవైపు.. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదాలను ఎదుర్కోవడం వరుసగా ఇది మూడో రోజు. గత గురువారం ముంబయి- గాంధీనగర్‌ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు.. అహ్మదాబాద్‌ సమీపంలోని వట్వా రైల్వేస్టేష వద్ద గేదెలను ఢీ కొట్టింది. దీంతో  రైలు ముందు భాగం ఊడిపోయింది. ఆ తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధీనగర్‌ నుంచి ముంబయికి బయలుదేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ ఆనంద్‌ స్టేషను సమీపంలో ఆవును ఢీకొట్టింది. మళ్లీ ముందుభాగం నొక్కుకుపోయి రైలు పది నిమిషాలు ఆగింది.

ఇదీ చదవండి: వందే భారత్ రైలు ఘటన.. గేదెల యజమానులపై కేసు

మరిన్ని వార్తలు