ఒక చట్టం... వేల వివాదాలు

12 May, 2022 06:11 IST|Sakshi

దేశద్రోహ చట్టం ఆది నుంచీ వివాదాస్పదమే

ఇంగ్లండ్, పలు దేశాల్లో రద్దు

భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తోందన్న కోర్టులు

124ఏ. బ్రిటిష్‌ వలస పాలకుల కాలం నాటి దేశద్రోహం చట్టం. సుప్రీంకోర్టు స్టే నేపథ్యంలో దీనిపై అంతటా చర్చ జరుగుతోంది. మన దేశంలో ఇది దుర్వినియోగమవుతుండటం నిజమేనా...?

సెక్షన్‌ 124 ఏలో ఏముంది?
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై ఎవరైనా మాటలతో, చేతలతో, సంకేతాలతో, ప్రదర్శనలతో, విద్వేషపూరిత వ్యాఖ్యలతో శత్రుత్వాన్ని ప్రదర్శిస్తే దేశద్రోహ నేరం కిందకి వస్తుంది. దీని కింద కేసు నమోదైతే బెయిల్‌ లభించదు. ముందస్తు నోటీసులు లేకుండా అరెస్టు చేయవచ్చు. నేరం రుజువైతే మూడేళ్ల నుంచి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దేశ ద్రోహం కేసులు ఎదుర్కొన్న వారు ప్రభుత్వోద్యోగాలకు అనర్హులు.

ఎందుకు తెచ్చారు ?
స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలల్ని అణిచేసేందుకు ఈ చట్టాన్ని తెచ్చారు. బ్రిటిషిండియా తొలి లా కమిషనర్‌ థామస్‌ మెకాలే రూపొందించిన ఈ చట్టాన్ని 1890లో 124ఏ సెక్షన్‌ కింద భారత శిక్షా స్మృతిలో చేర్చారు. దీనికింద 1891లో తొలిసారిగా జోగేంద్ర చంద్రబోస్‌ అనే పత్రికా సంపాదకుడిపై కేసు పెట్టారు. తర్వాత తిలక్‌ మొదలుకుని గాంధీ దాకా ప్రముఖులెందరో కూడా ఈ చట్టం కింద జైలుపాలయ్యారు. బ్రిటన్‌ మాత్రం దీన్ని 2009లో రద్దు చేసింది. ఆస్ట్రేలియా, సింగపూర్‌ కూడా ఈ చట్టాన్ని రద్దు చేశాయి.

దిశ రవి నుంచి వరవరరావు వరకు  
కేంద్రంలో మోదీ ప్రభుత్వం రాజకీయంగా ఎదురు తిరిగిన వారిపై దేశద్రోహ చట్టాన్ని విస్తృతంగా ప్రయోగిస్తోందన్న ఆరోపణలున్నాయి. కశ్మీర్‌పై వ్యాఖ్యలు చేసినందుకు అరుంధతి రాయ్, రైతు ఉద్యమానికి మద్దతుగా టూల్‌ కిట్‌ రూపొందించిన సామాజిక కార్యకర్త దిశ రవి, హత్రాస్‌లో 19 ఏళ్ల దళిత మహిళ గ్యాంగ్‌ రేప్‌ కవరేజీకి వెళ్లిన జర్నలిస్టు సిద్దిఖి కపన్, పటీదార్‌ కోటా ఆందోళనలో పాల్గొన్న హార్దిక్‌ పటేల్,  భీమా–కొరెగావ్‌ కేసులో సామాజిక కార్యకర్తలు సుధా భరద్వాజ్, వరవరరావు, కరోనా సంక్షోభంపై వ్యాఖ్యలకు జర్నలిస్టు వినోద్‌ దువా తదితరులపై దేశద్రోహ ఆరోపణలు మోపారు.

► 2015–20 మధ్య దేశవ్యాప్తంగా సెక్షన్‌ 124ఏ కింద 356 కేసులు నమోదయ్యాయి
► ఈ ఆరేళ్లలో 548 మంది అరెస్టయ్యారు. ఆరుగురికి మాత్రమే శిక్ష పడింది.
► 2010–20 మధ్య బిహార్‌లో 168, తమిళనాడులో 139, యూపీలో 115, జార్ఖండ్‌లో 62, కర్నాటకలో 50, ఒడిశాలో 30 కేసులు నమోదయ్యాయి.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

మరిన్ని వార్తలు