అప్పుడు ప్రధాని మోదీ, ఇప్పుడు సీఎం యోగికి షాకిచ్చిన బీజేపీ ఎంపీ.. తిరుగుబాటు!

23 Jul, 2022 11:09 IST|Sakshi

అధికార బీజేపీలో వ్యతిరేక గళం వినిపిస్తోంది. రెండు క్రితం యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు షాకిస్తూ కేబినెట్‌ మంత్రి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో కాషాయ పార్టీ ఎంపీ ఏకంగా.. బీజేపీ సర్కార్‌పైనే విమర్శలు ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది. 

అయితే, యూపీలో ఈనెల 16న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ 296 కిలో మీట‌ర్ల బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన విషయం తెలిసిందే. చిత్ర‌కూట్ లోని భ‌ర‌త్ కూప్ నుంచి ఇటావాలోని కుంద్రెల్‌ను క‌లిపే ఈ నాలుగు లైన్ల ఈ ఎక్స్‌ప్రెస్‌వేను యోగి సర్కార్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు రూ.15వేల కోట్ల‌తో నిర్మించారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జ‌లౌన్ జిల్లా స‌మీపంలో కొన్నిచోట్ల పెద్ద రోడ్డుపై గుంత‌లు ఏర్ప‌డ్డాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ పిలిభిత్ నియోజకవర్గం ఎంపీ వరుణ్‌ గాంధీ.. బీజేపీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వారం రోజుల్లోనే రోడ్డు ఇలా అయితే ఎలా అంటూ ప్ర‌శ్నలు సంధించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌ వేదికగా.. ఈ ప్రాజెక్ట్ హెడ్‌, నిర్మాణంలో భాగ‌స్వాములైన కంపెనీలు, ఇంజనీర్ల‌కు వెంట‌నే స‌మ‌న్లు జారీ చేయాల‌ని అన్నారు. బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కాగా, సొంత పార్టీ ఎంపీనే ఇలా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో ప్రతిపక్ష నేతలు మాటల దాడి ప్రారంభించారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌.. బీజేపీ ప్ర‌భుత్వం తీరుపై మండిప‌డ్డారు. రోడ్డు నిర్మాణ విషయంలో ఇంజనీర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇదిలా ఉండగా, వరుణ్‌ గాంధీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌పై సమయం వచ్చిన ప్రతీసారి విమర్శలు చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ఉద్యోగ నోటిఫికేషన్ల భర్తీ విషయంలోనూ మోదీపై వరుణ్‌ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌లో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉందంటూ.. ప్రస్తుతం ఇదే దేశంలో బర్నింగ్‌ ప్రాబ్లమ్‌ అంటూ వ్యాఖ్యానించారు. దేశ వ్యాప్తంగా 60 లక్షలకుపైగా మంజూరైన పోస్టులు ఖాళీగా ఉండటం ఏంటని ప్రశ్నల వర్షం కురిపించారు.

 ఇదిలా ఉండగా.. కేంద్ర గణాంకాలను నమ్మవచ్చా? పలు శాఖల్లోని ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని వరుణ్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ఈ పోస్టులకు కేటాయించిన బడ్జెట్‌ ఎక్కడకు వెళ్లింది? అని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరీ ఈ విషయం తెలుసుకునే హక్కు ఉందని ఘాటు వ్యాఖ‍్యలు చేశారు. మరోవైపు.. వరుణ్‌ గాంధీ పార్టీ మరబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇది కూడా చదవండి: మహారాష్ట్రలో ట్విస్టులు.. షిండే సర్కార్‌కు బిగ్‌ షాక్‌!

మరిన్ని వార్తలు