వీర్‌బాల్‌ దివస్‌గా డిసెంబర్‌ 26

10 Jan, 2022 06:26 IST|Sakshi

ప్రకటించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: సిక్కుల పదో గురువు గురు గోవింద్‌ సింగ్‌ కుమారులు వీరమరణం పొందిన డిసెంబర్‌ 26వ తేదీన ఏటా ఇకపై వీర్‌బాల్‌ దివస్‌గా పాటించాలని ప్రధాని మోదీ కోరారు. గురు గోవింద్‌ సింగ్‌ జయంతి సందర్భంగా ఆదివారం ప్రధాని ఈ ప్రకటన చేశారు. న్యాయం కోసం నిలబడి మొఘల్‌ పాలకుల క్రౌర్యానికి బలైన గురు గోవింద్‌ సింగ్‌ నలుగురు కుమారులకు ఇదే అసలైన నివాళి అవుతుందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘సాహిబ్‌జాదా జొరావర్‌ సింగ్, సాహిబ్‌జాదా ఫతేహ్‌ సింగ్‌ మొఘల్‌ పాలకులు వారిని బంధించి గోడ కట్టడంతో వీరమరణం పొందారు. నమ్ముకున్న ధర్మానికి కట్టుబడి ప్రాణాలను సైతం వారు త్యజించారు’అని పేర్కొన్నారు. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల కారణంగా బీజేపీపై ఆగ్రహంతో ఉన్న సిక్కు వర్గాన్ని మంచి చేసుకునే చర్యల్లో భాగంగానే తాజాగా ప్రధాని మోదీ ఈ ప్రకటన చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు