షాకింగ్‌ వీడియో: కాళ్లు తెగిపడి పట్టాలపై దీనంగా రోదిస్తూ.. పోలీసుల వల్లే!

3 Dec, 2022 11:09 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో హేయనీయమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. వీధి వ్యాపారితో పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో.. ఆ కంగారులో ఆ యువకుడు రైలు పట్టాల మీదకు పరిగెత్తాడు.  అయితే వేగంగా దూసుకొచ్చే రైలు అతన్ని చిధిమేయడంతో రెండు కాళ్లు పొగొట్టుకుని పట్టాలపై పడి ఆ బాధతో విలపించాడు. ఈ ఘటన వీడియో ద్వారా సోషల్‌ మీడియాకు చేరింది. 

యూపీ కాన్పూర్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. సాహిబ్‌ నగర్‌కు చెందిన అర్‌సలాన్‌ అనే 18 ఏళ్ల యువకుడు.. కళ్యాణ్‌పూర్‌ ప్రాంతంలోని  జీడీ రోడ్‌ దగ్గర కూరగాయలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పోలీసులు.. చిరువ్యాపారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే యత్నం చేశారు. ఇంతలో ఇద్దరు కానిస్టేబుళ్లు అర్‌సలాన్‌ కూరగాయల దుకాణం వద్దకు వచ్చి వాగ్వాదానికి దిగారు. 

ఆపై అర్‌సలాన్‌పై హెడ్‌ కానిస్టేబుల్‌ రాకేష్‌ చెయ్యి చేసుకుని.. అతని కూరగాయల తూకం రాయిని దూరంగా విసిరేశాడని ప్రత్యక్ష సాక్ష్యులు చెప్తున్నారు. అది రైలు పట్టాలపై పడడంతో దానిని తెచ్చుకునేందుకు పరిగెత్తాడు ఆ యువకుడు. అంతలో వేగంగా దూసుకొచ్చిన రైలు.. అతని కాళ్లను ఛిద్రం చేసేసింది. అక్కడికక్కడే కాళ్లను పొగొట్టుకున్న ఆ యువకుడు బాధతో పట్టాల మధ్యలో పడి విలపిస్తూ సాయం కోసం చేతులు చాచాడు. 

అక్కడే ఉన్న కొందరు అతన్ని రోదన పట్టించుకోకుండా వీడియో తీస్తూ ఉండిపోయారు. ఇంతలో జనం తిరగబడతారనే భయంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు అర్‌సలాన్‌ను పట్టాల మీద నుంచి పక్కకు తీసుకెళ్లారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో.. రాకేశ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అక్కడ కొందరు తీసిన వీడియోల ఆధారంగా ఏం జరిగిందో తెలుసుకునే యత్నం చేస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు వెల్లడించారు.

ఇదీ చదవండి: పాముకి స్నానం.. ఇలాంటి వీడియోను చూశారా?

మరిన్ని వార్తలు