20 లక్షల వాహనాలు తుక్కు లోకి!

25 Feb, 2023 10:45 IST|Sakshi

భువనేశ్వర్‌: రోడ్లపై రవాణాకు పట్టు కోల్పోయి, 15 ఏళ్లు పైబడిన 20 లక్షలకు పైగా వాహనాలను రద్దు చేయనున్నారు. రాష్ట్ర వాణిజ్య, రవాణాశాఖ మంత్రి టుకుని సాహు అసెంబ్లీలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిజిస్టర్డ్‌ వెహికల్‌ స్క్రాపింగ్‌ ఫెసిలిటీ పాలసీ–2022 ప్రకారం, వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి 20 లక్షలకు పైగా వాహనాలను దశల వారీగా రోడ్ల నుంచి తొలగిస్తామన్నారు.

15 ఏళ్లకు పైగా రవాణాలో ఉపయోగిస్తూ.. పట్టు కోల్పోయిన 20,39,500 వాహనాలను గుర్తించామన్నారు. రద్దు చేయనున్న వాహనాల్లో 12,99,351 ద్విచక్ర వాహనాలు ఉన్నాయని తెలిపారు. దీనికి సంబంధించి స్క్రాపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. డొక్కు వాహనాలు రద్దు చేయడంతో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం స్క్రాపింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టిందన్నారు. పాలసీ మార్గదర్శకాల ప్రకారం పాత వాహనాల యజమానులు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రోత్సాహకాలు కూడా పొందుతారని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

చదవండి   వైద్యుల నిర్లక్ష్యం.. ఆస్పత్రి ఎదుటే ప్రసవమైన మహిళ!

మరిన్ని వార్తలు