Scrappage Policy: స్క్రాప్‌పాలసీతో సమ్మిళితాభివృద్ధి

14 Aug, 2021 03:11 IST|Sakshi

సర్క్యులర్‌ ఎకానమీకి ప్రోత్సాహమన్న ప్రధాని మోదీ

గాంధీనగర్‌: జాతీయ నూతన ఆటోమొబైల్‌ స్క్రాపేజ్‌ పాలసీని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ పాలసీతో సర్క్యులర్‌ ఎకానమీకి ప్రోత్సాహం లభిస్తుందని చెప్పారు. వ్యర్ధాలను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా ముడిపదార్థ్ధాల వ్యయాన్ని తగ్గించుకునే ఆర్థిక నమూనాను సర్క్యులర్‌ ఎకానమీ అంటారు. నూతన పాలసీతో పర్యావరణ హిత ఆర్థిక సమ్మిళితాభివృద్ధి మరింత వేగవంతమవుతుందన్నారు. పాత వాహనాల రీసైక్లింగ్‌కు నూతన స్క్రాపేజ్‌ పాలసీ దారి చూపుతుంది. దీనివల్ల దేశీయ మొబిలిటీ, ఆటో రంగానికి కొత్త రూపు వస్తుందని మోదీ చెప్పారు.

నూతన పాలసీ విడుదల సందర్భంగా ఏర్పాటైన ఇన్వెస్టర్‌ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు.  దేశీయ రవాణా రంగంలో కాలం తీరిన(ఫిట్‌నెస్‌ లేని) వాహనాలను శాస్త్రీయంగా  తొలగించేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుందని మోదీ తెలిపారు.  గతేడాది భారత్‌ రూ. 23వేల కోట్ల విలువైన స్క్రాప్‌ స్టీల్‌ను దిగుమతి చేసుకుందని, కొత్త పాలసీతో ఈ అవసరం చాలావరకు తీరవచ్చని చెప్పారు. పలు రకాల ఖనిజాలను సైంటిఫిక్‌గా రికవరీ చేయడానికి కొత్త పాలసీ బాటలు పరుస్తుందని, దీంతో ఆయా ఖనిజాల కోసం దిగుమతులపై ఆధారపడే అవసరం కూడా తగ్గుతుందన్నారు. ఓడల రీసైక్లింగ్‌కు పేరొందిన అలాంగ్‌ ప్రాంతం అన్ని వాహనాల రీసైక్లింగ్‌ హబ్‌గా ఎదగాలని ఆకాంక్షించారు.

నూతన విధానంలో ముఖ్యాంశాలు
► వాహనం వయసును బట్టి కాకుండా ఫిట్‌నెస్‌ను బట్టి స్క్రాపింగ్‌కు పంపడమే కొత్త విధానంలో కీలకం.
► కొత్త విధానం ప్రకారం తమ పాత వాహనాలను స్వచ్ఛందంగా స్క్రాప్‌కు ఇచ్చే వారికి ప్రభుత్వం ఒక సర్టిఫికెట్‌ ఇస్తుంది.  
► ఈ సర్టిఫికెట్‌ చూపిన వారికి కొత్తవాహనాల కొనుగోలు సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు ఉండదు. దీంతోపాటు వీరికి రోడ్‌టాక్స్‌లో కొంత రిబేటు సైతం ఇస్తారు.  
► నూతన తుక్కువిధానంతో కొత్తగా రూ. 10వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా
► దేశంలో దాదాపు కోటి అన్‌ఫిట్‌(కాలం తీరిన) వాహనాలున్నాయి, వీటిని తక్షణం రీసైకిల్‌ చేయాల్సిఉంది.

మరిన్ని వార్తలు