హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు..

2 Jul, 2021 21:08 IST|Sakshi

సిమ్లా: ఉత్తర భారతంలో ఓవైపు ఎండలు దంచి కొడుతుంటే.. మరోవైపు ఆకస్మిక వరదలు కొన్ని ప్రాంతాలను కకావికలం చేసాయి. కొండ ప్రాంతమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమై, రహదారులు స్తంభించి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. చంబా వ్యాలీలో ఆకస్మికంగా వరద రావడంతో స్థానిక జనం ఉలిక్కిపడ్డారు. ఉన్నపళంగా వరద ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా జులాఖడీ, ముగ్లా, కరియన్‌, హర్దాస్పురాల్లో పరిస్థితి దారుణంగా మారింది. చంబా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది.

రోడ్లపై వరదనీరు నిండడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు బురదలో ఇరుక్కుపోయాయి. మరోవైపు వర్షం కూడా ప్రారంభమై ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో వరద ఆగడం లేదు. అధికారులు భారీ సహాయక చర్యలు చేపట్టి, రోడ్లపై వరదనీటిని తొలగించడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారుల తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. ప్రతి ఏటా చంబా లోయలో ఇదే సమస్య ఉందని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు వరద ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో వాహనాలు నీటిపై తేలాడుతున్నాయి. వరద తగ్గిన చోట వాహనలు బురదలో కూరుకుపోయాయి. దీంతో వాహన యాజమానులు లబోదిబోమంటున్నారు.

వందలాదిమంది కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. సహాయక చర్యల కోసం బుల్‌డోజర్లను వినియోగిస్తున్నారు. ఇళ్లలోకి వరదనీరు ప్రవేశించడంతో ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. ఇంటి సామానంతా వరదనీటిలో కొట్టుకుపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆకస్మిక వరదల కారణంగా చంబా వ్యాలీలో అపారనష్టం జరిగింది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నతాధికారులు పర్యటించారు. పరిస్థితిని సమీక్షించి, నష్టపోయిన వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల వెంట తామున్నామంటూ హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 

మరిన్ని వార్తలు