చట్టసభల్లో నిరసనకు హద్దులుండాలి

1 Sep, 2021 06:35 IST|Sakshi

సభాగౌరవానికి భంగం కలిగించరాదు

చట్టసభల్లో అంతరాయాలు ప్రజల జీవితాలను, జాతి ఆకాంక్షలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి 

ప్రణబ్‌ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో నిరసనలు తెలపడంలో తప్పు లేదని, అదే సమయంలో సభా గౌరవాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు, చట్టాల్లోని లోపాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ప్రజా ప్రతినిధుల హక్కు అయినప్పటికీ, అవి భావోద్వేగాలకు దారి తీసి పరిమితులు దాటకూడదని హితవు పలికారు.  చట్టసభల్లో కార్యకలాపాలకు తరచూ అంతరాయాలు కలుగుతుండటం, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం స్ఫూర్తికి విఘాతం కలిగే పరిస్థితులు చోటు చేసుకోవడంపై ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తొలి స్మారకోపన్యాసం చేసిన ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో అంతరాయాలపై సుదీర్ఘంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమాన్ని ప్రణబ్‌ ముఖర్జీ లెగసీ ఫౌండేషన్‌ వర్చువల్‌ వేదికగా నిర్వహించింది.  ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుందని, రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండడమే నిజమైన ప్రజాస్వామ్యాన్ని, సమగ్రాభివృద్ధిని ముందుకు తీసుకెళుతుందని ఉపరాష్ట్రపతి తెలిపారు. చట్టసభల్లో అంతరాయాలతో జవాబుదారీతనం కొరవడి, ఏకపక్ష ధోరణి ఏర్పడే ప్రమాదముందని ఉపరాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ బుద్ధి కుశలత, అసాధారణ జ్ఞాపకశక్తి అనేక వివాదాస్పద అంశాలకు సమాధానాన్ని చూపిందన్న ఉపరాష్ట్రపతి, పన్ను సంస్కరణలను స్వయంగా ఆర్థికమంత్రిగా సేవలందించిన ప్రణబ్‌ స్వాగతించిన విషయాన్ని గుర్తు చేశారు. 2018లో నాగపూర్‌లో జరిగిన ఆర్‌.ఎస్‌.ఎస్‌. శిక్షణా శిబిరంలో ప్రణబ్‌ ముఖర్జీ పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, హుందాగా వ్యవహరించగల ప్రణబ్‌ వ్యక్తిత్వానికి ఇది ఉదాహరణ అన్నారు. జాతీయవాదం గురించి మాటల్లో చెప్పే వారికి, నిజమైన జాతీయవాదాన్ని చేతల్లో చూపించారని తెలిపారు.  

దేశాభివృద్ధికి ప్రణబ్‌ విశేష సేవలు: మోదీ
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దార్శనికతగల గొప్ప నేత అని ప్రధాని మోదీ శ్లాఘించారు. అత్యుత్తమ ప్రజాజీవితం, పరిపాలనా దక్షత, సునిశిత దృష్టి కలిగిన ఆయన వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ప్రణబ్‌ ముఖర్జీ ప్రథమ  స్మారకోపన్యాసంలో ప్రధాని ఈ మేరకు పేర్కొన్నారు. అమోఘ ప్రజ్ఞాపాటవాలు కలిగిన ప్రణబ్‌ దేశాభివృద్ధికి గుర్తుంచుకోదగ్గ సేవలందించారని తెలిపారు. దేశ ప్రజాస్వామ్య విలువలను ఆయన పరిపుష్టం చేశారన్నారు. ఈ సందర్భంగా బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ ఖలీదా జియా వర్చువల్‌గా ప్రసంగించారు. యువ ఎంపీగా బంగ్లాదేశ్‌  అవతరణకు తోడ్పాటునందిం చారని ప్రణబ్‌ను కొనియాడారు. బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాలంటూ 1971 జూన్‌లో రాజ్యసభలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారని గుర్తుకు తెచ్చుకున్నారు. భూటాన్‌ రాజు జింగ్మే కేసర్‌ నామ్‌గ్యాల్‌ వాంగ్‌చుక్‌ తన ఉపన్యాసంలో.. ప్రణబ్‌తో పలుమార్లు తాను భేటీ అయ్యాయని చెప్పారు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నాననీ, ఆయన లోటు తీర్చలేనిదని తెలిపారు. ప్రణబ్‌ముఖర్జీ దేశానికి 13వ రాష్ట్రపతిగా 2012–17 మధ్య కాలంలో పనిచేశారు. కాంగ్రెస్‌ నేత అయిన ఆయన కేంద్ర ప్రభుత్వంలో పలు శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు.

>
మరిన్ని వార్తలు