Derek Obriens Farewell Speech: వెంకయ్య భావోద్వేగం  

9 Aug, 2022 08:35 IST|Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ ఎగువ సభ గౌరవాన్ని మరింత ఉన్నత స్థానానికి చేర్చేందుకు చైర్మన్‌ ఎం.వెంకయ్య నాయుడు విశేషమైన కృషి చేశారని ప్రధాని మోదీ కొనియాడారు. ‘‘రాజకీయాల నుండి రిటైర్‌ అయ్యానని, కానీ ప్రజా జీవితంలో అలసిపోలేదని మీరు తరచుగా చెబుతుంటారు. మీ పదవీ కాలం ముగియవచ్చు గానీ మీ జీవితం, మీ అనుభవాలు రాబోయే కాలంలో దేశానికి మార్గదర్శకంగా ఉంటాయి’’ అని వెంకయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య పదవీ కాలం 10న ముగియనుంది.

ఇదిలా ఉంటే, వెంకయ్య వ్యవసాయ కుటుంబంలో జన్మించారని, ఏడాది వయసులో తల్లిని కోల్పోయారని టీఎంసీ నేత డెరెక్‌ ఓబ్రియన్‌ చెప్పారు. ఈ సందర్భంగా వెంకయ్య కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక నిమిషం పాటు చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకున్నారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ.. ఒత్తిడిలోనూ బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తించారని వెంకయ్యను ప్రశంసించారు. సభ గౌరవాన్ని వెంకయ్య పెంచారని డీఎంకే సభ్యుడు తిరుచ్చి శివ చెప్పారు.
 
ఆత్మకథ రాయండి  
వెంకయ్య నాయుడి రాజకీయ జీవితం, అందించిన సేవలు అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని రాజ్యసభ ఎంపీలు పేర్కొన్నారు. ఆయన గురించి భవిష్యత్తు తరాలు తెలుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందుకే ఆత్మకథ(ఆటోబయోగ్రఫీ) రాయాలని వెంకయ్యకు విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ చైర్మన్‌ హోదాలో జూనియర్లు, సీనియర్లు అనే తేడా లేకుండా సభ్యులందరినీ సమానంగా చూశారని, వివక్ష ప్రదర్శించలేదని పలువురు ఎంపీలు కొనియాడారు.    

చదవండి: (పాలిటిక్స్‌లో పిడుగుపాటు.. బీజేపీతో సీఎం నితీశ్‌ కుమార్‌ తెగదెంపులు!)

మరిన్ని వార్తలు