రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల గృహాలకు శంకుస్థాపన

10 Aug, 2020 18:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల కోసం 40 నివాస గృహాల నిర్మాణానికి ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సోమవారం ఆన్‌లైన్ వేదిక ద్వారా శంకుస్థాపన చేశారు. ఢిల్లీలోని ఆర్కే పురం సెక్టార్-12లో రూ.46 కోట్లతో ఈ నివాస సముదాయాన్ని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. 2003లోనే విలువైన ఈ స్థలాన్ని రాజ్యసభ సచివాలయానికి కేటాయించినప్పటికీ ఆ తర్వాత వివిధ అడ్డంకుల కారణంగా ఆలస్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల విషయంలో తీవ్ర కొరత ఉందన్న ఆయన, రెండేళ్ళుగా ఈ అంశం మీద కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హార్దీప్ సింగ్ పురి సహా, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులతో విస్తృత సమావేశాల తర్వాత ఈ అంశం కొలిక్కి వచ్చిందని తెలిపారు. ఈ విషయం మీద ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కూడా మాట్లాడామన్నారు. (రాహుల్‌తో భేటీ.. సొంతగూటికి పైలట్‌?!)

టైప్ -3, టైప్ -4 క్వార్టర్ల కొరత తీవ్రంగా ఉందన్న ఉపరాష్ట్రపతి, ఆర్కేపురం నిర్మాణ సముదాయంలో మొదటి దశలోనే ఈ తరహాకు చెందిన 32 క్వార్టర్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కార్యాలయానికి దగ్గరగా గృహనిర్మాణం వల్ల ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబరిచే దిశగా ప్రేరణ లభిస్తుందని అభిప్రాయపడ్డారు. నాటి పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర మంత్రిగా రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్ మెంట్ యాక్ట్ – 2016ను అమలు చేయడంలో తీసుకున్న చొరవను గుర్తు  చేసుకున్న ఉపరాష్ట్రపతి మరిన్ని గృహాల నిర్మాణానికి చేయూతనివ్వాలని పట్టణాభివృద్ధిశాఖ మంత్రికి సూచించారు. దీని అమలులో భాగస్వాములందరు తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. (ప్రమాద ఘటనపై వైఎస్‌ జగన్‌కు ప్రధాని మోదీ ఫోన్‌)

శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ... రాజ్యసభ సచివాలయ ఉద్యోగుల నివాస గృహాల కొరత తీర్చేందుకు, మూడేళ్లలో ఈ నివాస సముదాయ నిర్మాణం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. ‘రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్యనాయుడు ఈ గృహ సముదాయ నిర్మాణం కోసం తీసుకున్న చొరవ, చేపట్టిన చర్యలు, నిరంతర పర్యవేక్షణ కారణంగానే సమస్యలు చాలావరకూ తొలగి, ఇవాళ ప్రారంభోత్సవానికి మార్గం సుగమమైందని కేంద్రమంత్రి తెలిపారు. (ప్లాస్మా దానం చేయనున్న మధ్యప్రదేశ్‌ సీఎం)

పట్టణ ప్రాంతాల్లో అందరికీ నివాస గృహాలు అందించాలన్న లక్ష్యంతో  2016లో ప్రారంభించిన హౌసింగ్ ఫర్ ఆల్ మిషన్ కింద ఇప్పటికే 1.07 కోట్ల నివాస గృహాల మంజూరు జరిగిందని, ఇప్పటికే లక్ష ఇళ్ళను లబ్ధిదారులకు స్వాధీనం చేశామని, మరో 65 లక్షల ఇళ్ళు నిర్మాణంలో ఉన్నాయని తెలిపారు. మొత్తం 1.12 కోట్ల నివాస గృహా మంజూరు లక్ష్యాన్ని 2022 కంటే ముందుగానే చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ, కార్యదర్శి డాక్టర్ పీపీకే రామాచార్యులు, ఎన్బీసీసీ సీఎండీ  పీకే గుప్తా, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ,రాజ్యసభ సచివాలయ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు