కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ మృతి

13 Sep, 2021 16:10 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ కన్నుమూశారు. ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ గత జూలై చివరలో మెదడులో రక్తం గడ్డకట్టడంతో మంగళూరు ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ఫెర్నాండేస్‌ మృతిపై సదరు ఆస్పత్రి యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఫెర్నాండేజ్‌ మృతి పట్ల కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌,  కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకగాంధీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు ట్విటర్‌ వేదికగా సంతాపం ప్రకటించారు. 

ఫెర్నాండెజ్ 1941 మార్చి 27న జన్మించారు. ఆయన తండ్రి రోక్ ఫెర్నాండెజ్‌ ఒక విద్యావేత్త., రోక్ ఫెర్నాండెజ్‌ మణిపాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి మొదటి అధ్యక్షుడిగా పనిచేశారు. ఆస్కార్‌ ఫెర్నాండేజ్‌ తల్లి లియోనిస్సా ఫెర్నాండెజ్ భారతదేశంలో మొదటి మహిళా మేజిస్ట్రేట్. కాగా ఫెర్నాండేజ్‌ 1975-76లో ఉడిపి మున్సిపల్‌ కౌన్సిలర్‌గా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అదే ఉడిపి నుంచి 1980లో మొదటిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. మొత్తం అయిదుసార్లు (1980, 1984, 1989, 1991, 1996) ఆయన ఉడిపి నుంచి ప్రాతినిధ్యం వహించారు.

ఫెర్నాండెజ్ 1984-85లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీకి పార్లమెంటరీ సెక్రటరీగా పనిచేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అంత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా పనిచేసిన యూపీఏ 1 హయాంలో ఆయన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తించారు. విదేశాంగ వ్యవహారాలు, యూత్ అండ్ స్పోర్ట్స్, గణాంకాలు వాటి అమలు ప్రోగ్రాం, లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ శాఖల బాధ్యతలు చూశారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత ఫెర్నాండెజ్ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2004లో కూడా మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
చదవండి: కాంగ్రెస్‌కు ఊహించని షాక్: హాట్‌హాట్‌గా ఉత్తరాఖండ్‌ రాజకీయం

మరిన్ని వార్తలు