పార్లమెంటే అత్యుత్తమం: ఉపరాష్ట్రపతి

20 Mar, 2023 05:46 IST|Sakshi

కొందరు విదేశాల్లో దేశంపై విషం చిమ్ముతున్నారంటూ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంటే అత్యుత్తమమని ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తేల్చిచెప్పారు. రాజ్యాంగం మన పార్లమెంట్‌లోనే పురుడు పోసుకుందని గుర్తుచేశారు. రాజ్యాంగ రచనలో న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థ తదితరాల పాత్ర ఎంతమాత్రం లేదన్నారు. ప్రజల తీర్పును పార్లమెంట్‌ ప్రతిబింబిస్తుందని చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి పార్లమెంటేనని వివరించారు. తమిళనాడు మాజీ గవర్నర్‌ పీఎస్‌ రామ్మోహన్‌రావు జీవిత చరిత్ర గ్రంథాన్ని జగదీప్‌ ధన్‌ఖడ్‌ ఆదివారం పార్లమెంట్‌ ప్రాంగణంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ధన్‌ఖడ్‌ మాట్లాడారు.

సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ నడుమ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో జగదీప్‌ ధన్‌ఖడ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, దేశాభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు విదేశాలకు వెళ్లి మన దేశంపై విషం చిమ్ముతున్నారని, మన ప్రజాస్వామ్యంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ధన్‌ఖడ్‌ విమర్శించారు! అలాంటి వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఇటీవల బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం పార్లమెంటులో దుమారం రేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాహుల్‌ పేరు ప్రస్తావించకుండా ధన్‌ఖడ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని వార్తలు