ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా 

30 Sep, 2020 04:14 IST|Sakshi

ఐసీఎంఆర్‌ సీరో సర్వేలో వెల్లడి 

న్యూఢిల్లీ: దేశంలో బయటపడుతున్న కొత్త కరోనా కేసుల సంఖ్య కోలుకుంటున్న వారి కంటే తగ్గుతూ వస్తోంది. మరోవైపు దేశంలో పదేళ్లు దాటిన వారిలో ఆగస్టు నాటికి ప్రతి 15 మందిలో ఒకరికి కరోనా సోకినట్లు అంచనా వేస్తున్నామని ఐసీఎంఆర్‌ చేసిన సెకండ్‌ సీరో సర్వే తెలిపింది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు మంగళవారం విడుదలయ్యాయి. నగర మురికి వాడల్లో 15.6 శాతం కరోనా సోకగా, మురికివాడలు కాకుండా మిగిలిన ప్రాంతాల్లో 8.3 శాతం సోకినట్లు సర్వేలో తేలిందన్నారు. ఈ సర్వేను 21 రాష్ట్రాలకు చెందిన 700 గ్రామాల్లో జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. భారత్‌ లో ప్రతి మిలియన్‌ మందిలో 4,453 మందికి కరోనా సోకగా, 70 మరణాలు సంభవించాయని, ప్రపంచంతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పారు.

ఇదెలా ఉండగా, దేశంలో మంగళవారం కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో కొత్త కేసులకంటే రికవరీలు ఎక్కువగా నమోదయ్యాయి. కొత్తగా 70,589 కేసులు నమోదు కాగా, 84,877 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 61,45,291 కి చేరుకోగా, మొత్తం రికవరీల సంఖ్య 51,01,397 కు చేరుకుంది. గత రెండు వారాల్లోనే 11 లక్షలకు పైగా రికవరీలు అయినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 776మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 96,318కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,47,576 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 15.42 శాతం ఉన్నాయి. యాక్టివ్‌ కేసులతో పోలిస్తే రికవరీలు 5.38 రెట్లు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమక్రమంగా 83.01 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 

జగన్నాథుని ఆలయంలో 404 మందికి ..
ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథ స్వామి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న 351 మంది అర్చకులకు, 53 మంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఆలయ అధికారులు తెలిపారు. దేవాలయంలోని అర్చనలు ఒకదాని తర్వాత ఒకటి జరగాల్సి ఉంటుందని, ఏ ఒక్కటి జరగకపోయినా తర్వాత జరగాల్సినవి ఆగిపోతాయని చెప్పారు. ఈ క్రమంలో అర్చకులు ఒకరి తర్వాత ఒకరు ఉదయం నుంచి రాత్రి వరకు పని చేయడంతో కరోనా ఎక్కువగా ప్రబలినట్లు చెప్పారు. 

ఉపరాష్ట్రపతికి కరోనా పాజిటివ్‌ 
ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఉదయం సాధారణ  పరీక్షల్లో భాగంగా కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా వచ్చిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. అయితే ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపింది. వైద్యుల సూచనల మేరకు హోం క్వారంటైన్‌లో ఉంటున్నట్టు తెలిపింది. ఉపరాష్ట్రపతి సతీమణి ఉషా నాయుడికి మాత్రం కోవిడ్‌ నెగెటివ్‌గా తేలింది. ఆమె సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.

మరిన్ని వార్తలు