Video: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి ఐదు గుంజీల శిక్ష

25 Nov, 2022 11:21 IST|Sakshi

మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు నానాటికీ పెరిగిపోతున్నాయి. పసిమొగ్గల నుంచి పండటాకుల వరకు ఎవరిని  వదలం లేదు. ఎన్ని చట్టాలు అమలు చేసినా, కఠిన శిక్షలు విధించినా కామాంధుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు. దేశంలో మహిళ భద్రత ప్రశ్నార్థకంగా మారిన సమయంలో బిహార్‌లో జరిగిన ఓ ఘటన సమాజాన్ని నివ్వేరపరుస్తోంది. రాష్ట్రంలో అత్యాచార నిందితుడికి అక్కడి గ్రామ పెద్దలు వింత శిక్ష విధించారు.

నవదా జిల్లాలోని ఓ గ్రామంలో అరుణ్‌ పండిట్‌ అనే వ్యక్తి చాకెట్ల ఆశచూసి అయిదేళ్ల బాలికను కోళ్ల ఫామ్‌కు తీసుకెళ్లి  లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకోగా.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి… ఈ విషయాన్ని పంచాయతీలో తేల్చుకోమని సూచించాడు. దీంతో వారు పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పారు.

అయితే పంచాయితీ పెద్దలు సొంత నిర్ణయంతో తీర్పును ప్రకటించారు. నిందితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడలేదని చెబుతూ..కేవలం ఆమెను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లినందుకు మాత్రమే అతనికి శిక్ష వేశారు. నిందితుడికి గ్రామస్థులందరి ముందు ఐదు గుంజీలను శిక్షగా విధించి చేతులు దులుపుకున్నారు. పంచాయతీ పెద్దల షాకింగ్ పనిష్మెంట్ అక్కడి వారందరినీ ఒక్కసారిగా అవాక్కయ్యేలా చేసింది.

పంచాయతీ పెద్దలు, గ్రామస్తుల ముందు నిందితుడు గుంజీలు తీస్తున్న దృశ్యాలను అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 14 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. పంచాయతీ తీర్పుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గ్రామీణ భారతదేశంలో పిత్రుస్వామ్యానికి ఈ ఘటన నిదర్శనమని, న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి వేసిన శిక్ష ఇదేనా? బాలికకు చేసే న్యాయం ఇదేనా?  అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ వీడియోను బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్,  డిప్యూటీ తేజస్వి యాదవ్‌ను ట్యాగ్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసు సూపరింటెండెంట్ గౌరవ్ మంగ్లా తెలిపారు. అంతేగాక ఈ దారుణాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
చదవండి: 'గే' వివాహాలకు చట్టబద్దత కోరుతూ సుప్రీంకోర్టులో పిల్‌

మరిన్ని వార్తలు