Video: యువతితో రైల్వే టీసీ అసభ్య ప్రవర్తన.. మద్యం మత్తులో రెచ్చిపోయి..

15 Mar, 2023 17:50 IST|Sakshi

బస్సు, రైలు, విమానం.. ఇలా ప్రతి చోట ప్రయాణికులకు భద్రత కరువవుతోంది. ప్రయాణిస్తున్న వారితో అనుచితంగా ప్రవర్తించడం, మూత్ర విసర్జన ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ బెదిరింపు ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న రైల్వే టికెట్‌ కలెక్టర్‌.. మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఉదంతం కర్ణాటకలో చోటుచేసుకుంది. 

కేఆర్‌ పురం రైల్వే స్టేషన్‌లోని టికెట్‌ కలెక్టర్‌.. అక్కడే నిలబడి ఉన్న మహిళా ప్రయాణికురాలి వద్దకు వచ్చి టికెట్‌ చూపించాలని అడిగాడు. అయితే ఆ సమయంలో టీసీ ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. యువతి తన ఫోన్‌లో టికెట్‌ కోసం వెతుకుతుండగా.. ఆమె టికెట్‌ లేకుండా రైలు ఎక్కిందని టీసీ ఆరోపణలు చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది.

స్టేషన్‌లో జరుగుతున్న తతంగాన్ని అక్కడే ఉన్న కొందరు తమ ఫోనల్లో చిత్రీకరించారు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఇందులో.. నన్ను ఎందుకు వేధిస్తున్నారు. నేను టికెట్‌ బుక్‌ చేసుకున్నాను కాబట్టే ఇక్కడ ఉన్నానంటూ యువతి టీసీతో గట్టిగా అరవడం కనిపిస్తోంది. దీనిపై టీసీ స్పందిస్తూ.. టికెట్‌ చూపించి వెళ్లు.. ఇది నా పని అంటూ హిందీలో చెప్పడం చూడవచ్చు. 
చదవండి: ‘అధికారంలోకి వచ్చాక.. నీ సంగతి చెప్తా’.. కర్ణాటక డీజీపీకి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

కాగా తాను టిక్కెట్‌ను బుక్ చేసుకున్నానని, దానిని వేరే టిక్కెట్ కలెక్టర్‌కి చూపించానని యువతి పేర్కొంది. అయినా టీసీ తనపై దుర్భాషలాడుతూ.. తాకేందుకు ప్రయత్నించాడని యువతి ఆరోపించింది. తనతో ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని అతన్ని ప్రశ్నించింది. స్టేషన్‌లో ఉన్న మరికొందరు ప్రయాణికులు ఆమెకు మద్దతుగా నిలిచారు. అక్కడి నుంచి మెల్లగా జారుకుంటున్న టీసీని.. యువతి దగ్గరికి లాక్కొచ్చారు. చివరికి ఈ విషయం రైలే శాఖ వరకు చేరడంతో టీటీఈని నైరుతి రైల్వే అధికారులు సస్పెండ్‌ చేశారు. దీనిపై విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు