వైరల్‌ వీడియో: బెంజ్‌కార్‌లో రేషన్‌ కోసం బీదవాడు.. ఇదీ అసలు సంగతి

6 Sep, 2022 19:21 IST|Sakshi

వైరల్‌: దేశంలో సంక్షేమ ఫలితాలు అర్హులకే అందుతున్నాయా? లబ్ధిదారులకు పంపిణీ అంతా సజావుగానే సాగుతోందా?. కానీ, ఏదైనా ఘటన వెలుగు చూస్తేనే.. అవకతవకలంటూ ఆరోపణలు వినిపిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. బెంజ్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి రేషన్‌ సరుకులు తీసుకెళ్లడం.. ఆ వీడియో కాస్త వైరల్‌ కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో ఈ ఘటన జరిగింది. నలోయన్‌ చౌక్‌లో ఉన్న ఓ ప్రభుత్వ రేషన్‌ దుకాణం ముందు ఓ లగ్జరీ మెర్సిడెస్‌ బెంజ్‌ కారు వచ్చి ఆగింది. అందులో నుంచి దిగిన ఓ వ్యక్తి.. సరాసరి రేషన్ దుకాణంలోకి వెళ్లాడు. కాసేపటికి ఒక వ్యక్తితో రేషన్‌ సరుకుల సంచులు మోయించుకుని వచ్చి..  బెంజ్‌ కారు డిక్కీలో వాటిని పెట్టించుకుని వెళ్లిపోయాడు. ఇంకేం.. అక్కడే ఉన్న కొందరు ఆ ఘటనను వీడియో తీసి వైరల్‌ చేశారు. సరదా కోసం వాళ్లు చేసిన పని.. పెనుదుమారమే రేపింది. 

అర్హులు కానివాళ్లకు రేషన్‌ అందుతోందంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో మీడియా సదరు రేషన్‌ డీలర్‌ను సంప్రదించింది. అయితే ఆ వ్యక్తికి బీపీఎల్‌(బిలో పావర్టీ లైన్‌) కార్డు ఉందని.. తాను కేవలం ఆ కార్డును పరిశీలించిన తర్వాతే రేషన్ ఇచ్చానని చెప్పాడు ఆ డీలర్‌. మరోవైపు బెంజ్‌ కారులో వచ్చిన వ్యక్తి సైతం స్పందించాడు.

తన పేరు రమేష్‌ సైని అని, ఆ కారు తమ బంధువులదని, వారు విదేశాలకు వెళ్లడంతో కారును తమ ఇంటి దగ్గర పార్క్‌ చేశారని చెప్పాడు. డీజిల్‌ కారు కావడంతో అప్పుడప్పుడు దానిని వాడుతున్నట్లు చెప్పాడాయన. నేను బీదవాడినే. నాకు చిన్న వీడియోగ్రఫీ దుకాణం ఉంది. నా పిల్లలు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతున్నారు. పిల్లలను ప్రైవేట్‌లో చదివించేంత డబ్బు కూడా నా దగ్గర లేదు అంటూ రమేష్‌ సైని వెల్లడించాడు. అయితే ఈ వివరణతో వివాదం చల్లారలేదు. పంజాబ్‌ ప్రభుత్వం అందిస్తు‍న్న ఆటా దాల్‌ పథకంలో భాగంగా.. ఆ వ్యక్తి గోధుమల్ని రేషన్‌లో తీసుకెళ్లినట్లు తేలింది. దీంతో విమర్శల నేపథ్యంతో.. పంజాబ్‌ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి లాల్‌ చంద్‌ కటారుచక్‌ ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. 

ఇదీ చదవండి: అయ్యో.. జాలిలేకుండా చూస్తూ ఉండిపోయింది

మరిన్ని వార్తలు