చదివేది ఆరో తరగతే.. బ్యాటింగ్‌లో సిక్సర్ల మోతే..!

15 Oct, 2022 18:31 IST|Sakshi

శ్రీనగర్‌: మహిళ క్రికెట్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అయినప్పటికీ ఆ వైపుగా బాలికలను ప్రోత్సహించేవారు చాలా తక్కువ. అలాంటిది జమ్ముకశ్మీర్‌ వంటి ప్రాంతాల్లో అస్సలు ఊహించలేం. కానీ, ఎప్పుడూ తుపాకుల మోతలతో దద్దరిల్లే ప్రాంతంలో ఓ చిన్నారి క్రికెట్‌ బ్యాటు పట్టింది. తన బ్యాటింగ్‌ నైపుణ్యంతో అందరి చూపును తనవైపునకు తిప్పుకుంటోంది. అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్న ఆ విద్యార్థిని వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. లద్దాఖ్‌లోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీఎస్‌ఈ) ఆ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. తన క్రికెట్‌ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆరో తరగతి విద్యార్థిని మాక్సూమాగా గుర్తించినట్లు పేర్కొంది. 

‘ఇంటి వద్ద మా నాన్న, స్కూల్‌లో మా టీచర్‌ క్రికెట్‌ ఆడమని ప్రోత్సహించారు. విరాట్‌ కోహ్లీలా ఆడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నా. నా చిన్నప్పటి నుంచి క్రికెట్‌ ఆడుతున్నాను. హెలికాప్టర్‌ వంటి షాట్స్‌ ఎలా ఆడాలి అనేది నేర్చుకుంటున్నా. నాకు ఇష్టమైన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. ఆయనలాగే ఆడాలనుకుంటున్నా.’ అని విద్యార్థిని మాక్సూమా పేర్కొంది. వీడియోలో.. క్రికెట్‌ ఆడుతున్న తీరుకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఓ బంతిని ఏకంగా గ్రౌండ్‌ బయటకు పంపిన తీరు అందరిని ఆకట్టుకుంటోంది. శుక్రవారం వీడియో పోస్ట్‌ చేయగా 25వేల వ్యూస్‌, 1,200 లైక్స్‌ వచ్చాయి.

ఇదీ చదవండి: రూ. 9 లక్షల లోన్‌ కట్టాలని బ్యాంక్‌ నోటీస్‌.. గంటల్లోనే అదృష్టం తలుపు తట్టింది

మరిన్ని వార్తలు