స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణకు ఒప్పుకోం: విజయసాయిరెడ్డి

22 Mar, 2021 18:04 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశం గురించి వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వరంగ సంస్థలు సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశగా పనిచేస్తాయన్న ఆయన, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేసేందుకు ఒప్పుకొనే ప్రసక్తే లేదని స్సష్టం చేశారు. ‘‘ప్రైవేట్‌ రంగ సంస్థలు లాభార్జనే ఏకైక ధ్యేయంగా నడుపుతాయి. కాబట్టి సంస్థను ప్రైవేటీకరించడం సరికాదు’’ అని పేర్కొన్నారు. ఇక స్టీల్‌ప్లాంట్‌కు కోకింగ్‌ కోల్‌ కొరత ఉందన్న విజయసాయిరెడ్డి, సంస్థకు సొంత గనులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా వైజాగ్‌ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఈ గంటే గతంలో విశాఖలో భూగంట మోగించలేదా?
ఇక విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ గురించి పలువురు రాజకీయాలు చేయడంపై ట్విటర్‌ వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ‘‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి కొందరు "గంటలు" కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో  సొంత "గంట" మోగిస్తున్నారు. ఆ "గంట"లో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ధిలేదు. ఆ "గంట" శబ్దాల వెనుకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా? ఈ గంటే గతంలో విశాఖలో "భూగంట" మోగించలేదా?’’ అని ప్రశ్నించారు. 

చదవండి: విశాఖలో బీఎస్‌–6 ఇంధన ఉత్పత్తి

>
మరిన్ని వార్తలు